Mahanadu: కడప మహానాడులో వర్గపోరుల రాజకీయం..

తెలుగుదేశం పార్టీకి (Telugu Desam party) అత్యంత ప్రాముఖ్యమైన మహానాడు (Mahanadu) ఈసారి కడప జిల్లాలో (Kadapa Zilla) మూడురోజుల పాటు జరగనుంది. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకూ వేదికగా మహానాడు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నాయి. ఈసారి మహానాడుకు రెండు కీలక విశేషాలు ఉన్నాయి. మొదటిది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి (Jagan) సొంత జిల్లా అయిన కడపలో తొలిసారి ఈ మహాసభలు జరుగుతున్నాయి. రెండవది కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో జరగుతోంది. ఈ రెండు కారణాల వల్లే కాదు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు (Chandra Babu) 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం కూడా వేడుకలకు ఓ ప్రత్యేకతను ఇస్తోంది. యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రాజకీయంగా మరింత బలపడుతున్న పరిస్థితి కూడా ఈ సభలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఇక మిత్రపక్షాల నుంచే వచ్చే 15 ఏళ్లపాటు కూటమి బలంగా కొనసాగుతుందని వినిపిస్తున్న సంకేతాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు చాలా ప్రత్యేకంగా నిర్వహించాలని భావించిన చంద్రబాబు దాదాపు ఐదు లక్షల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా సమీకరణలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యాచరణ కోసం రెండు మూడు కమిటీలను వేయగా, మిగతా కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద మహానాడు ఈసారి అద్భుతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కానీ కడప జిల్లాలో జరుగుతున్న ఈ భారీ ఈవెంట్‌కు అదే జిల్లాకు చెందిన కొంతమంది నేతలు దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీటెక్ రవి (BTech Ravi), ఎమ్మెల్యే మాధవి (MLA Madhavi) వంటి నేతలు పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహానాడు జరిగేది కమలాపురం నియోజకవర్గంలో (Kamalapuram) కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే సతీష్‌రెడ్డికి (MLA Satish Reddy) ప్రధాన బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అయితే బీటెక్ రవి వర్గం మాత్రం తమను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపిస్తోంది. పలు పనులకు సంబంధించిన సమాచారం సైతం తమకు ఇవ్వలేదని, అందులో తమకు ఎలాంటి పాత్రలూ ఇవ్వకపోవడం తనకు అభ్యంతరంగా ఉందని చెబుతున్నారు.
ఇక ఎమ్మెల్యే మాధవి కూడా ఈ తరహా వ్యూహాలకు తాను దూరంగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నేతల దూరం మహానాడు ఏర్పాట్లపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి మాత్రం ఎవరు వచ్చినా రాకున్నా, తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తానని స్పష్టం చేశారు.