వైసీపీ రాజ్యసభ ఎంపీలపై టీడీపీ కన్ను..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత అధికారం మారింది. వైసీపీ ఓడిపోయి ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ సమయంలో ఆ పార్టీకి తిరిగులేని మెజారిటీ ఉండేది. దీంతో ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు లాంటి పదవుల్లో ఆ పార్టీ అధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ శాసనమండలిలో వైసీపీ బలమే ఎక్కువ. అదే సమయంలో రాజ్యసభలో కూడా ఆ పార్టీకి 11 మంది ఎంపీలున్నారు. అధికార టీడీపీకి ఒక్కరు కూడా లేరు. దీంతో రాజ్యసభలో బలం పెంచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వైసీపీ ఎంపీలను లాక్కునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీకి అనుబంధంగా చెప్పుకునే సాక్షి పత్రిక ఇవాళ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను మభ్యపెట్టి లాక్కునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందనేది ఆ కథనం సారాంశం. ఐదారుగురు ఎంపీలకు ఒక్కొక్కరికి 40 నుంచి 70 కోట్ల వరకూ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని పేర్కొంది. ఈ కథనం ఏపీలో సంచలనం కలిగిస్తోంది. కొంతమంది ఎమ్మెల్సీలు, మరికొంతమంది ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చాలాకాలంగా వార్తలు వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా సాక్షి దినపత్రిక ఆ కథనం రాసేసరికి ఈ వార్తలో నిజముందని తేలిపోయింది.
వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీల్లో కొందరు బీజేపీలో చేరబోతున్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి సహా పలువురు ఎంపీలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇందుకు జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్పుకుంటున్నారు. గతంలో టీడీపీ ఓడిపోగానే సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వాళ్లు టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబే వాళ్లను బీజేపీలోకి పంపించారనే టాక్ ఉంది. ఇప్పుడు జగన్ కూడా తమ ప్రయోజనాలు నెరవేర్చాలంటే కొంతమంది కీలక నేతలను బీజేపీలోకి పంపడమే మేలనే ఆలోచనలో జగన్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే కొందరు బీజేపీలోకి వెళ్తారని తెలుస్తోంది.
అయితే మిగిలిన ఐదారుగురు ఎంపీలను టీడీపీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే కొందరు ఎంపీలు చంద్రబాబుతో టచ్ లోకి వచ్చారని సమాచారం. పైగా రాజ్యసభలో తమ పార్టీకి ప్రాతనిధ్యం లేకపోవడంతో వాళ్లను చేర్చుకుంటే మంచిదనే ఆలోచనే టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతమంది వస్తారో చూసి దాన్ని బట్టి వాళ్ల చేత రాజీనామాలు చేయించాలా.. లేకుంటే వైసీపీని విలీనం చేసుకోవాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి త్వరలోనే వైసీపీకి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.













