పొత్తుపై టెన్షన్…
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చలు .. ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలకు ఆనందం కలిగిస్తున్నా.. మరోవైపు ఓ చిన్న భయం కూడా వెన్నాడుతోంది.ఎందుకంటే మూడు పార్టీల పొత్తులు ఖరారైతే.. కనీసం 45 స్థానాలను టీడీపీ కోల్పోవాల్సి ఉంటుంది. అంటే మిత్రపక్షాలకు సుమారు 45 స్థానాలను టీడీపీ వదులుకోవాల్సి వస్తుంది..ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే 20 నుంచి 25 స్థానాలను కచ్చితంగా ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీకి 10 నుంచి 15 స్థానాల వరకు ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ స్థానాలను త్యాగం చేయక తప్పదు.
ఆంధ్ర ప్రదేశ్ లో 175 స్థానాల్లో 40 నుంచి 45 స్థానాలు జనసేన, బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. గెలిస్తే జనసేన పార్టీ నుంచి ముగ్గురు, లేదా నలుగురు, బీజేపీకి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవే కాకుండా ఎంపీ స్థానాల్లో కూడా కొన్నింటిని టీడీపీ వదులుకోక తప్పదు. విపక్షంలో ఉండి అధికార వైసీపీ దాడులు, ప్రలోభాలకు ఎదురొడ్డి నిల్చున్నా.. తమకీసారి టికెట్ వస్తుందా? ఫొత్తులో భాగంగా నష్టపోకతప్పదా అన్న చర్చ జరుగుతోంది
ఇప్పటికే జనసేన కొన్ని స్థానాలపై కన్నేసింది. మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో పలుస్థానాలను కోరే అవకాశముంది. వీటితో పాటు గతంలో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలను కోరనున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇటీవలే పలువురు వైసీపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉంటున్నారు. వారిలో పలువురికి .. టికెట్ దక్కే అవకాశాలున్నాయి. దీంతో అక్కడ కూడా టీడీపీనేతల టికెట్లు గల్లంతైనట్లే అని చర్చ జరుగుతోంది.
అయితే ఇన్నాళ్లుగా పార్టీ జెండా మోసి, ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన తమను కాదని.. వేరే వ్యక్తులకు టికెట్లు ఇస్తే.. ద్వితీయశ్రేణి నేతలు ఊరుకుంటారా? దీంతో ఈసారి రెబల్స్ గా ఎక్కువమంది బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చంద్రబాబు.. ఎలా సమన్వయం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.













