TDP: రాజంపేటలో రాజకీయ గందరగోళం: టీడీపీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన కీలక నేతలంతా వరుసగా పార్టీ కి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇటీవలి పరిణామాలు తెలుగుదేశం పార్టీ (TDP) శిబిరాన్ని ఒక్కసారిగా కలవరం లోనయ్యేలా చేశాయి. ముఖ్యంగా కడప (Kadapa) జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల మహానాడు ముగిసిన కొద్దికాలానికే ఆ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత టీడీపీకి రాజీనామా చేయడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
రాజంపేట (Rajampet) నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం (Sugavasi Balasubrahmanyam) టీడీపీకి గుడ్ బై చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే టీడీపీ తరఫున రాజంపేట నుంచి పోటీ చేశారు కానీ విజయం మాత్రం సాధించలేకపోయారు. ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొన్న ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు లేఖ రాశారు.
ఆ లేఖలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి మనోభావాలను ఆమోదిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “నమస్తే” అంటూ ముగించిన లేఖ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో రాజంపేట టీడీపీలో కొనసాగుతున్న వర్గ పోరులు మరింత ముదిరిపోయినట్లు సమాచారం. బత్యాల చెంగలరాయుడు (Bathala Chengalarayudu) వర్గీయులు ఒక సమావేశం నిర్వహించి ఆయన్నే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు సైతం మోకాళ్లపై కూర్చుని నినాదాలు చేయడం ఈ కలహాల తీవ్రతను తెలియజేస్తోంది.
ఇక కొంతమంది చెంగలరాయుడు అనుచరులు పార్టీ కార్యకలాపాల్లో వైఎస్సార్‌సీపీ కోవర్టులున్నారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశమైంది. బాలసుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ్రాయుడు (Palakondrayudu) 1978లో రాయచోటి (Rayachoti) నుంచి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరి 1984లో రాజంపేట ఎంపీగా గెలుపొందారు. 1999, 2004లో వరుసగా రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాంటి రాజకీయ వారసత్వాన్ని కలిగిన బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు పార్టీకి దూరమవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.