ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మానవహక్కుల కమిషన్ కు SFI ఫిర్యాదు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధులను రోడ్లపై గంటలపాటు నిలబెట్టడం దారుణమని, సన్మానం అంటే అభిమానంతో చేయాలి గానీ, బలవంతంగా కాదని భారత విద్యార్ధి ఫెడరేషన్ (SFI) విమర్శించింది. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్ధులకు రాజకీయాలు ఎందుకు అని విమర్శిస్తుంటారు. కానీ ఆయన అవసరాలకు, ప్రభుత్వ ప్రచారాలకు విద్యార్ధులను పావులుగా వాడుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
ఇప్పటికే ఇలా ఎస్ ఆర్ ఎం, విట్ యూనివర్శిటీల శంకుస్ధాపనకు విద్యార్ధులను తరలించడం జరిగిందని, దోమలపై యుధ్దం అంటే విద్యార్ధులతో ర్యాలీలు నిర్వహించారని దీని వల్ల విద్యార్ధులు అమూల్యమైన స్టడీఅవర్స్ ను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఏ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించినా ఆ ప్రాంత విద్యార్ధులను ముఖ్యమంత్రి, మంత్రుల సభలకు తరలించడం షరామామూలుగా మారిందని, దీంతో విద్యార్ధులకు సిలబస్ కాక అనేక ఇబ్బందులు ఏదుర్కొంటున్నారని విమర్శించారు.
విద్యార్ధుల సమస్యలపై పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం అదే విద్యార్ధులను ఏ విధంగా ఉదయం 7 గంటల నుండి గంటల తరబడి గన్నవరం నుండి సచివాలయం వరకు రోడ్లుపై మానవహారం నిలబెట్టిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
డిఈఓలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చి బలవంతంగా విద్యార్ధులను చంద్రబాబు ర్యాలీకి పంపాలి అనడం సరైనదికాదని, ఇది ముమ్మాటికి విద్యార్ధుల హక్కులను హరించడమే అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర మానవవనరుల శాఖకు, మానవ హక్కుల కమీషన్‌కు, బాలల హక్కుల కమీషన్‌కు SFI ఫిర్యాదు చేస్తుందని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు.













