Stree Shakthi: ఏపీలో ఇవాల్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్..!
ఆంధ్రప్రదేశ్ లో మహిళల సాధికారతకు ఊతమిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ (Stree Shakthi) పథకాన్ని ఇవాల్టి నుంచి అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా (Free bus to women) ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ (Super six) హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది.
స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్జెండర్లు ఐదు రకాల APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. 1. పల్లె వెలుగు, 2. అల్ట్రా పల్లె వెలుగు, 3. సిటీ ఆర్డినరీ, 4. ఎక్స్‌ప్రెస్, 5. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. నాన్-స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాలి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద జీరో ఫేర్ టికెట్ తీసుకోవడం తప్పనిసరి. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు. ఈ టికెట్లపై ‘స్త్రీ శక్తి’ అని ముద్రించ ఉంటుంది. అంతేకాక.. ప్రయాణ వివరాలతో పాటు రాయితీ మొత్తాన్ని జీరోగా పేర్కొంటారు. ఇప్పటికే స్టూడెంట్ లేదా సీజనల్ పాస్‌లు కలిగిన వారికి వాటి గడువు ముగిసే వరకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయబడవు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు విద్య, ఉద్యోగం, వైద్య సేవలు, వ్యాపార ప్రయాణాల కోసం సులభంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలపై ఆర్థిక భారాన్ని ఈ పథకం గణనీయంగా తగ్గిస్తుంది. ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వారి గౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది.
స్త్రీ శక్తి పథకం అమలుకోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,942 కోట్ల ఆర్థిక భారాన్ని భరిస్తోంది. APSRTCలో మొత్తం 11,449 బస్సులలో 8,458 బస్సులు (74%) ఈ పథకం కోసం కేటాయించారు. అదనంగా 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, రాబోయే రెండేళ్లలో మరో 1,400 బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీక్ అవర్స్‌లో రద్దీని నియంత్రించేందుకు అదనపు బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. పథకం అమలులో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు APSRTC అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రయాణం వర్తించే బస్సులను సులభంగా గుర్తించేందుకు వాటిపై ‘స్త్రీ శక్తి’ స్టిక్కర్లు అతికించారు. బస్సుల్లో సీసీ కెమెరాలు, మహిళా కండక్టర్ల కోసం బాడీ వేర్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలను మెరుగుపరిచారు. డ్రైవర్లు, కండక్టర్లకు జీరో టికెట్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళల సాధికారతకు బలమైన పునాది వేసిందని చెప్పొచ్చు. ఈ పథకం రాష్ట్రంలోని మహిళల జీవన విధానంలో సానుకూల మార్పులు తీసుకురావడమే కాకుండా, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చడం ద్వారా రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొంది.







