సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే… మమ్మల్ని అరెస్ట్
కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ జైలులో గురువారం నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు శ్రీనివాసరావు తమకు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని సావిత్రి కోరారు. నిందితుడు దళితుడు కాబట్టే ఇప్పటివరకు న్యాయం జరగలేదని అతడి సోదరుడు సుబ్బరాజు అవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ కోర్టుకు రావడం లేదన్నారు. సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. శ్రీను ఫోన్ చేసి జైలులో నిరాహారదీక్ష చేపడుతున్నట్లు చెప్పాడు. మా కుటుంబం కూడా విజయవాడలో దీక్ష చేపడుతుంది. గురువారం దుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్షకు కూర్చుంటాం అని తెలిపారు.













