హీటెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం
దేశంలో రాజకీయాలపైన అత్యంత ఆసక్తి ఉన్న రాష్ట్రం ఏదని ఆ మధ్య ఓ సర్వే జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ పుట్టిన పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకూ అందరికీ రాజకీయాలపై కాస్తోకూస్తో అవగాహన కచ్చితంగా ఉంటుంది. పుట్టింది మొదలు చచ్చేంత వరకూ ఇక్కడ రాజకీయాల్లో బతుకుతూనే ఉంటారు జనం. రాజకీయాల్లో నేరుగా ప్రవేశం లేకపోయినా పాలిటిక్స్ కు కచ్చితంగా ప్రభావితం అవుతూనే ఉంటారు. అందుకేనేమో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగులో పాతిక న్యూస్ చానళ్లు ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్కడ రాజకీయాలపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణ రోజల్లో కూడా ఏపీలో రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ పార్టీలు జనాలకు కనువిందు చేస్తుంటారు. ఇక ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో రేంజ్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. మే చివరి వారంలో ఫలితాలు విడుదలవుతాయని అంచనా. అందుకే ఎన్నికల కోసం పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో ఫుల్ బిజీ అయిపోయాయి. 2019లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అన్ని సీట్లూ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు మీదుంది. ఎప్పుడూ చివరి నిమిషం వరకూ అభ్యర్థులను తేల్చని ఆ పార్టీ.. ఈసారి మాత్రం అందరికంటే ముందుగా అనౌన్స్ చేసేసింది. ఇక జనసేన పార్టీ వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇందుకోసం అందరినీ కలుపుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇక బీజేపీ మాత్రం ఇప్పటికీ ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన కూటమిలో ఆ పార్టీ చేరుతుందా.. చేరదా.. అనే దానిపై ఆ పార్టీ నేతలకే ఇంకా క్లారిటీ లేదు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిల చేపట్టిన తర్వాత ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది.
వైసీపీ సిద్ధం!
ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఒకవైపు ప్రభుత్వ పరంగా, మరోవైపు పార్టీ పరంగా కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారు. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా దృష్టి సారించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విడతల వారీగా చేపట్టిన అనంతరం ఐప్యాక్ నుంచి సర్వేలను తెప్పించుకున్నారు జగన్. దానికి అనుగుణంగా అభ్యర్థుల వడపోత పూర్తి చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తల పేరిట ఇప్పటివరకూ ఏడు జాబితాలను విడుదల చేసింది వైసీపీ. 69 అసెంబ్లీ, 16 మంది ఎంపీ అభ్యర్థులకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 33 మంది సిట్టింగులకు సీట్లు దక్కలేదు. దీన్నిబట్టి ఈసారి సిట్టింగుల్లో చాలా మందికి సీట్లు దక్కడం కష్టమేనని అర్థమవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులను కొనసాగించి దెబ్బతిన్నారు. ఆ పొరపాట్లు తాను చేయకూడదని నిర్ణయించుకున్నారు జగన్. అందుకే నిర్మొహమాటంగా సిట్టింగులను మార్చేస్తున్నారు.
అభ్యర్థులని నేరుగా ప్రకటించకుండా నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో వివిధ దశల్లో 7 జాబితాలు విడుదల చేసింది వైసీపీ. మొదటి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించింది. రెండో జాబితాలో 24 అసెంబ్లీలు, 3 ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను ఎంపిక చేసింది. మూడో జాబితాలో 15 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలకు, నాలుగో జాబితాలో 8 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి, ఐదో జాబితాలో 3 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు, ఆరో జాబితాలో 6 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు, ఏడో జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. వీటిలో 33 మంది సిట్టింగులకు మొండిచేయి చూపడంతో వాళ్లల్లో చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే వాళ్లను దారికి తెచ్చుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. కొందరి విషయంలో ప్రయత్నాలు ఫలించలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వల్లభనేని బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్.. లాంటి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో వాళ్లంతా వేరే దారి చూసుకున్నారు. ఇదే బాటలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
వైసీపీ విడుదల చేసిన జాబితాలో చాలా మంది సిట్టింగులను ప్రస్తుత స్థానం నుంచి మరో చోటికి మార్చారు. ఇది విమర్శలకు తావిస్తోంది. ఒక నియోజకవర్గంలో పనికిరాని నాయకుడు మరో నియోజకవర్గానికి ఎలా పనికొస్తాడంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై మరో విమర్శ కూడా ఉంది. వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే పక్క నియోజకవర్గాల నేతలను బరిలోకి దింపుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. నెల్లూరు నేత అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా, చంద్రగిరి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు బరిలో నిలపడం ఈ కోవకే చెందుతాయి. ఎమ్మెల్యేల్లో చాలా మంది స్థానభ్రంశానికి గురయ్యారు. దీంతో సొంతపార్టీ నేతల నుంచే కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తమవయ్యాయి. కొన్నిచోట్ల అవి సర్దుకున్నాయి. వైసీపీ దాదాపు ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికీ అభ్యర్థులను అనౌన్స్ చేయకుండా సమన్వయకర్తల పేరిట జాబితాలు విడుదల చేసింది. ఇందులో ఉన్నవాళ్లే ఫైనల్ అభ్యర్థులు అని భావించాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. టీడీపీ, జనసేనకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని వైసీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. కానీ వైసీపీ కంటే ముందే 99 స్థానాలకు నేరుగా అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ. జనసేన. ఈ విషయంలో వైసీపీ వెనుకబడిందనే చెప్పొచ్చు.
సిద్ధం సభలు సూపర్ సక్సెస్
కేడర్ లో ఉత్సాహం నింపేందుకు వైసీపీ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహించింది. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన సిద్ధం సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఒక్కో సిద్ధం సభకు నాలుగైదు జిల్లాల నుంచి జనాన్ని సమీకరించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ సభలు జరిగాయి. బూత్ లెవల్ కేడర్ ను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ సమావేశాలు సూపర్ సక్సెస్ కావడంతో వైసీపీ కేడర్ ఫుల్ జోష్ లో ఉంది. సర్వేలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో సద్ధం సభలకు వచ్చిన రెస్పాన్స్ చూస్ మళ్లీ తమదే అధికారమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
తెలుగుదేశం దూకుడు!
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం బాగా బలహీనపడింది. కేడర్ దూరమైంది. కేసుల భారంతో నేతలు రాజకీయంగా యాక్టివ్‌గా ఉండట్లేదు. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది 50 రోజులపాటు ఆయన జైల్లో గడిపారు. ఆ పార్టీ అగ్రనేతలందరిపైనా ఏదో ఒక కేసు నమోదైంది. ఇప్పటికీ ఆ కేసుల విచారణ నడుస్తూనే ఉంది. ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయమనే భయం నేతల్లో ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే నేతలందరినీ తీసుకెళ్లి జైలులో వేస్తారని వణికిపోతున్నారు. అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. పార్టీని బతికించుకోవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. అందుకే గతానికి భిన్నంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
వైసీపీని ఓడించేందుకు అందరినీ కలుపుకుపోవాలని టీడీపీ నిర్ణయించింది. ఇప్పటికే జనసేన ఇందుకు అంగీకరించింది. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా రెండు పార్టీలూ అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమన్వయం చేసుకుంటున్నాయి. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో పొత్తులపై చర్చించారు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. ఆ పార్టీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే బీజేపీ కూడా కలుస్తుందనే నమ్మకంతో ఉన్నాయి ఇరు పార్టీలు.
బీజేపీకోసం ఎదురు చూడకండా తమ పని తాము చేసుకుపోతున్నాయి టీడీపీ, జనసేన. ఉమ్మడిగా రెండు పార్టీలూ టికెట్లు కూడా ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ సహజంగా చివరి నిమిషం వరకూ అభ్యర్థులను తేల్చదు. మరి కొన్ని గంటల్లో నామినేషన్ల గడువు ముగుస్తుందనగా అభ్యర్థులకు బీఫాం ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఈసారి మాత్రం ఆ ట్రెండ్ కు స్వస్తి చెప్పారు చంద్రబాబు. ఏకంగా 94 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. ఇంతమంది అభ్యర్థులను ఇలా ఒకేసారి ప్రకటించడం టీడీపీ చరిత్రలోనే తొలిసారి. అదీ కనీసం ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీడీపీ దూకుడుకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.
అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు ఈసారి కాస్త గట్టి నిర్ణయాలే తీసుకున్నారని చెప్పొచ్చు. ఎంతోమంది సీనియర్ నేతలకు తొలి జాబితాలో సీటు దక్కలేదు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు, యరపతినేని శ్రీనివాస రావు, కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజా, బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న, పీతల సుజాత లాంటి సీనియర్ నేతలకు జాబితాలో చోటు దక్కలేదు. దీంతో చాలా చోట్ల అసంతృప్తి మొదలైంది. సీట్లు దక్కని కొంతమంది నేతలను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. చాలావరకూ నేతలు మెత్తబడగా కొందరు మాత్రం ఇప్పటికీ రగిలిపోతున్నారు. వీళ్లను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అయితే టికెట్ దక్కని కొంతమంది నేతలు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఎన్నికల ముంగిట పలువురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరడం ఆ పార్టీలో ఉత్సాహం నింపుతోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తరపున బరిలో దిగబోతున్నారు. పార్టీలో చేరకముందే కొలను పార్థసారథికి నూజివీడు టికెట్ దక్కింది. ఇప్పటికే వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరిపోయారు. వీళ్లలో కోటంరెడ్డికి టికెట్ కూడా ఇచ్చారు చంద్రబాబు. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో అన్ని అంశాలు బేరీజు వేసుకుంటున్నారు. దాదాపు కోటీ 10 లక్షల మంది ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చూసి సామాజిక సమీకరణాల లెక్కలు వేసి చంద్రబాబు అభ్యర్థిని ఎంపిక చేస్తుంటారు. అయితే ఈ దఫా మాత్రం వైసీపీ అభ్యర్థులతో సంబంధం లేకుండా టీడీపీ అభ్యర్థులను ముందే ప్రకటించేశారు.
తండ్రీకొడుకుల ప్రచార హోరు
ఒక వైపు అభ్యర్థుల కసరత్తు చేస్తూనే మరోవైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కూడా టీడీపీ పెద్దపీట వేస్తోంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేశ్ నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. రా కదలిరా పేరుతో చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోజులో రెండు మూడు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కబెడుతున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రను త్వరగా ముగించేసి ఇప్పుడు శంఖారావం పేరుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. యువగళం పాదయాత్ర సాగని నియోజకవర్గాలకు మొదట ప్రయారిటీ ఇస్తున్నారు. నిరాశానిస్పృహల్లో ఉన్న టీడీపీ శ్రేణులకు చంద్రబాబు, లోకేశ్ ధైర్యం చెప్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని, జనసేన శ్రేణులతో కలిసి పని చేయాలని కోరుతున్నారు.
జనసేన యుద్ధం!
జనసేన పార్టీ పెట్టి పదేళ్లవుతోంది. అయినా ఇప్పటివరకూ ఆ పార్టీకి పెద్దగా క్షేత్రస్థాయి బలగం ఏర్పడలేదు. చట్టసభల్లో కూడా ఆ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన 2 చోట్లా ఓడిపోవడం కూడా ఆ పార్టీ శ్రేణులను నిరాశలో పడేసింది. అందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదనుకుంటున్నారు పవన్ కల్యాణ్. అందుకే జగన్ ను ఓడించే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారు. టీడీపీ కంటే ముందే వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారాయన. అందుకు అనుగుణంగానే టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నారు. బీజేపీని కూడా తమ కూటమిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల సమయంతో పోల్చితే ఇప్పుడు జనసేన బలపడింది. సంస్థాగత ఎన్నికల్లో జనసేన పార్టీకి కొన్ని స్థానాలు దక్కాయి. దీంతో కేడర్ లో ఉత్సాహం నెలకొంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించినప్పుడే పార్టీకి గౌరవం. అందుకే ఇప్పుడు కచ్చితంగా 98 శాతం స్ట్రయిక్ రేట్ సాధించాలని కంకణం కట్టుకున్నారు పవన్ కల్యాణ్. టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. అయితే సీట్ల సంఖ్య చాలా తక్కువనే విమర్శలు వస్తున్నాయి. హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నేతలు పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటుపై పెదవి విరుస్తున్నారు. మరికొందరు నేతలు కూడా ఇంకొన్ని సీట్లు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నట్టు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో కనీసం పది సీట్లయినా గెలుచుకుని ఉంటే ఇప్పుడు సీట్లు డిమాండ్ చేసే పొజిషన్లో ఉండేవారమని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పుకొస్తున్నారు. పార్టీకోసం పది రూపాయలు కూడా ఖర్చు చేయని వాళ్లు కూడా సీట్ల గురించి, పొత్తుల గురించి మాట్లాడుతూ విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు. టీడీపీతో సీట్ల సర్దుబాటుపై ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని.. తనకు ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉందని పవన్ కుండబద్దలు కొట్టారు.
తొలిజాబితాలో సీట్లు దక్కని పలువురు జనసేన నేతలు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. జనసేన నేతలు కీలకంగా ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాంటిచోట జనసేన నేతలు అసంతృప్తితో ఆందోళన చేస్తున్నారు. వారిని దారికి తెచ్చుకునేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. అయితే తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్ పేరు మినహా పవన్ కల్యాణ్, నాగబాబు పేర్లు కనిపించలేదు. దీంతో వాళ్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి కంటిన్యూ అవుతోంది. పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన కొణతాల రామకృష్ణకు ఎమ్మెల్యే సీటు ఖరారవడంతో అక్కడి నుంచి నాగబాబు పోటీకి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా జనసేన తాము పోటీ చేసే అన్ని స్థానాలను గెలిచి రావాలని పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ఇప్పటికీ క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టలేదు. అభ్యర్థులను వీలైనంత త్వరగా ఖరారు చేసి జనంలోకి వస్తే బాగుంటుందనేది జనసైనికుల ఆకాంక్ష.
అభ్యర్థులను ప్రకటించడంతో ఇకపై టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. జెండా పేరిట తాడేపల్లిగూడెంలో ఉమ్మడి భారీ బహిరంగసభకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగా జనంలోకి వెళ్తేనే సత్ఫలితాలు ఉంటాయని రెండు పార్టీలూ భావిస్తున్నాయి.
జనసేన అభ్యర్థులు
1. నెల్లిమర్ల – లోకం మాధవి
2. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
3. కాకినాడ రూరల్ – పంతం నానాజీ
4. తెనాలి – నాదెండ్ల మనోహర్
5. రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
టీడీపీ, జనసేన ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో ఈసారి విద్యాధికులే ఎక్కువగా ఉన్నారు. 60 మంది డిగ్రీ చదివగా 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇద్దరు పీహెచ్డీ చేయగా ఒకరు ఐఏఎస్, ముగ్గురు ఎంబీబీఎస్ చదివారు. అందరూ కనీసం డిగ్రీ చదివి ఉండడం విశేషం. ఇక 25-35 మధ్య వయసున్నవారు ఇద్దరుండగా 36-45 మధ్య వయసున్న వారు 22 మంది ఉన్నారు. 46- 60 ఏళ్లు వయసున్నవారు 55 మంది ఉండగా 61-75 వయసున్న 20 మందికి సీట్లు దక్కాయి. మొత్తం అభ్యర్థుల్లో 86 మంది మగవారు కాగా.. 13 మంది మహిళలు ఉన్నారు.
అయితే తొలి జాబితాలో బీసీలు, మైనారిటీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. తొలి జాబితాలో బీసీలకు 19, ఎస్సీలకు 20, కాపులకు 10, ఎస్టీలకు 3 సీట్లు కేటాయించారు. కమ్మ సామాజికవర్గానికి 22 సీట్లు దక్కగా రెడ్లకు 17, క్షత్రియులకు 4, వైశ్యులకు 2, వెలమలకు ఒక సీటు కేటాయించారు. మైనారిటీలకు ఒక్క సీటు దక్కింది.
క్రాస్ రోడ్స్ లో బీజేపీ!
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ ప్రభావం దాదాపు శూన్యం అనే చెప్పొచ్చు. అధికార, ప్రతిపక్షాలు రెండూ బీజేపీకి అనుకూలంగా ఉండడంతో పార్టీ బలోపేతానికి ఆ పార్టీ హైకమాండ్ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా అందుకు తగ్గ వాతావరణం బీజేపీలో లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది నేతలు బీజేపీలో చేరారు. గతం నుంచి కూడా కొంతమంది సీనియర్లు పార్టీలో ఉన్నారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా అడపాదడపా కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ అవి మీటింగులకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం దోహదపడట్లేదు. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చెప్తుంది. కానీ జనసేన మాత్రం టీడీపీతో కలిసి ఇప్పటికే మొదటి జాబితా కూడా ప్రకటించేసింది.
బీజేపీ కూడా తమతో కలిసొస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన కోరుకుంటున్నాయి. కొంతకాలం కిందట టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిచి పొత్తులపై చర్చించారు. చంద్రబాబు తన ప్రతిపాదనలను బీజేపీ పెద్దల ముందు ఉంచారు. వాటిపై ఢిల్లీ పెద్దలు ఇంతవరకూ తేల్చలేదు. దీంతో టీడీపీ, జనసేన తమ మొదటి జాబితాను అనౌన్స్ చేసేశాయి. బీజేపీ తమ కూటమితో కలిస్తే అప్పుడు మిగిలిన సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను సర్దుబాటు చేసేందుకు వెయిట్ చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ ఏదీ తేల్చలేదు. బీజేపీకి కూటమితో కలిసి వెళ్తేనే ప్రయోజనం. లేకుంటే ఒక్క సీటయినా గెలుచుకునే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ నేతలు కూడా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నారు. అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అధికార వైసీపీ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరి వైపు మొగ్గు చూపాలో బీజేపీ హైకమాండ్ కు అర్థం కాని పరిస్థితి.
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీతో కలిసి వెళ్లాలని ఏపీలోని అన్ని పార్టీలూ కోరుకుంటున్నాయి. బీజేపీ సపోర్ట్ లేకుంటే ఎన్నికల్లో గెలవలేమేమో అని టీడీపీ, జనసేన భయపడుతున్నాయి. అందుకే ఆ పార్టీతో కలిసి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నాయి. బీజేపీ అడిగితే ఏమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఏపీలో బలపడడానికి తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లట్లేదని అర్థమవుతోంది. అయితే టీడీపీ, జనసేన కూటమిలో చేరి 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ పోటీ చేయవచ్చని సమాచారం.
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్!
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే అనేక అనూహ్య పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు. అప్పటి నుంచి ఆ పార్టీలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. సోదరుడు వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా, ఏపీ సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రిగా ఎదిగారు. రాష్ట్రంలో పార్టీ పతనానికి జగనే కారణమని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోంది. అందుకే షర్మిల పార్టీలో చేరతానని చెప్పగానే అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించింది. షర్మిల కూడా జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కుటుంబ విభేదాలు నేపథ్యంలో వాళ్లద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇది ఇప్పుడు రాజకీయంగా కూడా మరింత ముదిరింది.
షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు మరింత పెంచింది. జగన్ ప్రభుత్వంపైన నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నవారందరినీ కలిసి పార్టీలోకి రావాలని కోరుతున్నారు. అదే సమయంలో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్ సీటు ఇవ్వలేదనే కోపంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీకి రాజనామా చేసి షర్మిల గూటికి చేరారు. అయితే అంతలోనే మళ్లీ జగన్ చెంతకు చేరిపోయారు. అయితే ప్రధాన పార్టీల్లో టికెట్ రాకపోతే కాంగ్రెస్ లో చేరేందుకు కొంతమంది కీలక నేతలు సిద్ధంగా ఉన్నారు.
ఈసారి ఎన్నికల ప్రచారంలో అన్నాచెల్లెళ్ల వార్ చూడబోతున్నాం. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమాత్రం బెదరట్లేదు. జగన్ కూడా చెల్లిపై యుద్ధమే ప్రకటించారు. వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షర్మిల కుమారుడి పెళ్లికి కానీ, రిసెప్షన్ కు కానీ జగన్ వెళ్లలేదు. దీన్నిబట్టి వాళ్ల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని అర్థమవుతోంది. ఇదే గ్యాప్ మున్ముందు కూడా ఏపీలో కనిపించబోతోంది.
కాంగ్రెస్ పార్టీ ఈసారి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. అప్లికేషన్లకు మంచి స్పందన లభించింది. దీంతో ఈసారి అన్ని చోట్లా పోటీ చేయడమే కాక సీట్లు కూడా దక్కించుకుంటామని నమ్ముతోంది. అయితే సీట్లు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాత్రం కాస్త మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.
– సి.ఎల్.ఎన్.రాజు













