చంద్రబాబును ఇరుకున పెట్టేందుకే పేరు మార్పు!? జగన్ మాస్టర్ స్ట్రాటజీ!!
ఆంధ్రప్రదేశ్ లో పేర్ల మార్పు రాజకీయం రసవత్తరంగా మారింది. పేరు మారిస్తే ఒరిగేదేమీ ఉండదని కొందరు అంటుంటే.. అసలు పేర్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉన్నవాటి పేర్లు మార్చడం కాదని.. కొత్తవి తీసుకొచ్చి పేర్లు పెడితే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. వీటిని పక్కన పెడితే అసలు పేరు మార్పు వెనుక జగన్ వ్యూహమేంటనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ ఎత్తుగడ వేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతారని జగన్ కు తెలుసు. అయినా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చంద్రబాబే టార్గెట్ అని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. అమరావతి, పోలవరం మొదలు ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ వరకూ ప్రతిదీ ఇక్కడ రాజకీయమే. దేశంలోనే తొలిసారి హెల్త్ యూనివర్సిటీని స్థాపించిన ఘనత కచ్చితంగా ఎన్టీఆర్ దే. ఆయన మరణానంతరం ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు అప్పటి సీఎం చంద్రబాబు. అది అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో వైఎస్ఆర్ పేరు పెట్టేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదనేది చంద్రబాబు వాదన. హెల్త్ యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. అలాంటి వ్యక్తి పేరును ఎలా మారుస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయి ఏంటి.. వైఎస్ఆర్ స్థాయి ఏంటి అని ఆయన నిలదీస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎన్టీఆర్ కంటే వైఎస్ఆర్ కే యూనివర్సిటీ పేరుండే అర్హత ఉందని వాదిస్తోంది. ఆరోగ్యశ్రీతో పాటు రాష్ట్రంలో అత్యధిక మెడికల్ కాలేజీలు వై.ఎస్.ఆర్, ఆయన తనయుడు జగన్ హయాంలోనే వచ్చాయని వైసీపీ చెప్తోంది. అందుకే ఎన్టీఆర్ కంటే వైఎస్ఆర్ పేరుండడమే సబబని వాదిస్తోంది.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా అనవసర వివాదాన్ని జగన్ తెరపైకి తీసుకొచ్చారని కొందరు వాదిస్తున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగానే ఈ వివాదం సృష్టించారని తెలుస్తోంది. చంద్రబాబు ఎన్టీఆర్ కు ఏం చేశారని ప్రశ్నించేందుకే ఎన్టీఆర్ చుట్టూ రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు జగన్. ఇదే అంశంపై చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం లేదని.. ఉంటే ఎందుకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని నిలదీస్తున్నారు. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ద్వారా మరోసారి చంద్రబాబును టార్గెట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. జగన్ వ్యూహం కూడా ఇదే. ఏదో ఒక రూపంలో చంద్రబాబును ఇరుకున పెట్టాలి. ఎన్టీఆర్ చుట్టూ అయితే మరింత సేఫ్. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది.













