RK Roja: పోలీసులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పీఎస్ఆర్(PSR) ను అరెస్ట్ చేసారని, తన పాలనా వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే కుట్రలు చేస్తున్నారని.. మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. అన్నింటా.. అవినీతి రాజ్యమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌ను పదేపదే అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజీపీ కేడర్‌లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూడా దీనిలో భాగమేనని మండిపడ్డారు. రాజధాని కాంట్రాక్ట్ సంస్ధల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్‌కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెరదీశారన్నారు.
గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఎటువంటి అరాచకాలకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు, లోకేష్ ల చేత నెత్తిన కిరీటం పెట్టించుకోవాలని తహతహలాడుతూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులంతా భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. రాబోయేది మళ్లీ వైయస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్ సీఎం అయ్యాక తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి జైళ్లకు పంపుతామన్నారు. అమరావతి కాంట్రాక్ట్‌ల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రోజా ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిపై అమరావతిలో నిర్మాణాల భూమిపూజకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించాలని సూచించారు.