Tirumala : తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
ఏడుకొండలపై కొలువుదీరిన సప్తగిరీశుడు శ్రీమలయప్ప స్వామి సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రథసప్తమి(Ratha Saptami) సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రాభవాన్ని భక్తులు తిలకించారు. ఉషోదయాన సూర్యప్రభ రథంతో ప్రారంభమైన వాహన సేవ చంద్రప్రభతో పరిసమాప్తమైంది. సూర్యభగవానుని అనుగ్రహంతో సంపూర్ణారోగ్యం సిద్ధిస్తుందనే విశ్వాసంతో ఉత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. వాహన సేవలకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) , ఈవో శ్యామలరావు (Shyamala Rao), అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.













