అమరావతి లో రైల్వే స్టేషన్
అమరావతి నుంచి దేశం నలు మూలలకు అనుసంధానం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అమరావతి రైలు మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు, రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడనుంది. గుంటూరు, విజయవాడలో రైల్వే స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నూతనంగా రాజధాని అమరావతిలో జరిగే రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికంగా నిర్మించడానికి ఇప్పటికే తొలి సర్వే పూర్తయింది. హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడు మీదుగా రాజధాని అమరావతి – విజయవాడ, అమరావతి-గుంటూరులకు మధ్య గల 106 కి.మీల రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2650 కోట్లతో అంచనాలు వేశారు. నూతన రైలు మార్గం అంతా విద్యుద్ధీకరణతో పాటు డబుల్ ట్రాక్ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రైల్వే వికాస్ నిగం తొలి సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీనిలో భాగంగా గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలోని సత్తెనపల్లి-పెదకూరపాడు మీదుగా తాడికొండ, రాయ పూడి, తుళ్లూరు, వెలగపూడి, మందడం, వెంకటా యపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా విజయవాడ కు నూతన రైలు మార్గం అనుసంధానం ఉండే విధంగా రూపొందించారు. తుళ్లూరు కేంద్రంగా ప్రధాన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగను న్నట్లు సమాచారం. ఉండవల్లి వద్ద కృష్ణానదిపై నూతన రైలు మార్గం నిర్మాణం నిమిత్తం ప్రత్యేకంగా డబుల్ ట్రాక్ వంతెనలు కట్టనున్నారు. ప్రాధమిక సర్వేలో రైల్వే స్టేషన్ల మార్పులు, చేర్పులు తదితర విషయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది సర్వే కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. తుది సర్వే నివేదిక అవ్వగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు.













