Raiden:విశాఖ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

విశాఖ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ (Google) అనుబంధ సంస్థ రైడెన్ (Raiden) ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.87,250 కోట్ల ( 10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులతో 1,000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ (Data Center) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్‌ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించింది. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థకు చెల్లించే ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. గూగుల్ సంస్థ రూ.52వేల కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖ (Visakhapatnam) లో ఏర్పాటు చేయబోతోంది. సిపీ సంస్థ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్‌ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది.