విజయవాడకు రానున్న రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్చి 31న విజయవాడ రానున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తెలిపారు. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు. స్థానిక అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటారని వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చేందుకే రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ వంటి స్వతంత్య్ర వ్వవస్థల ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ దిగజార్చారని, ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని పళ్లంరాజు అభిప్రాయపడ్డారు.













