RRR : ఎట్టకేలకు రఘురామకు పదవి..! శాంతించినట్లేనా..!?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. వైసీపీ ఎంపీగానే ఉంటూ ఆయన అలా మాట్లాడడం సహజంగానే ఎవరికీ నచ్చదు. జగన్ లాంటి వ్యక్తి ఇలాంటివాటిని అస్సలు సహించరు. అందుకే ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఆ సమయంలో రఘురామ కృష్ణరాజును మరింత వేధించారనే ఆరోపణలున్నాయి. దానిపై కేసు కూడా నమోదైంది. విచారణ కూడా జరుగుతోంది. మొత్తంగా చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడంలో రఘురామ కృష్ణంరాజు పాత్ర కూడా కీలకమనే బావించవచ్చు.
అలాంటి రఘురామ కృష్ణంరాజు తాజా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. వైసీపీ ఎంపీగా ఉంటూనే బీజేపీకి, టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారాయన. ఆయన మనసంతా బీజేపీ వైపే ఉండేది. కేంద్రంలో ఆయనకు పెద్దలతో పరిచయాలు ఉండడంతో తప్పకుండా తనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందనుకున్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో రఘురామ కృష్ణంరాజుకు టీడీపీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి మరీ ఉండిలో పోటీ చేసే అవకాశం కల్పించారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఆయనలో ఎక్కడో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.
వైసీపీని గద్దె దించడంలో తనదైన పాత్ర పోషించిన తనకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని రఘురామ కృష్ణంరాజు భావించారు. అయితే ఆ అవకాశం దక్కలేదు. దీంతో స్పీకర్ పోస్టు వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది. దీంతో టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తారని కొందరు చెప్తూ వచ్చారు. అయితే అది కూడా ఇవ్వలేదు. దీంతో ఆయనలో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతూ వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. పంటిబిగువన భరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేశారు చంద్రబాబు.
రఘురామ కృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేయగానే వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సరైన వ్యక్తికి ఆ పదవి కట్టబెట్టారంటూ టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారు. రఘురామ కృష్ణంరాజు కూడా తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడాన్ని స్వాగతించారు. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్, లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆయన ఈ పదవిని స్వాగతిస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే తన స్థాయికి, తాను చేసిన సేవకు ఈ పదవి చిన్నదనే భావన మాత్రం ఆయనలో ఉందని రఘురామ కృష్ణంరాజు సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏదీ లేనప్పుడు ఏది దక్కినా సంతృప్తి పడడమే..!













