రాధాకు సముచిత స్థానం : మంత్రి నిమ్మల
ప్రజాసేవకు ప్రాణమిచ్చే నాయకుడు వంగవీటి మోహన్రంగా (Vangaveeti Mohana Ranga) అని రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ (Kandula Durgesh), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. అందుకే ఆయన నేటికి ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని రంగా తనయుడు రాధాకృష్ణ (Radhakrishna)తో కలిసి మంత్రులు ఆవిష్కరించారు. ఇక్కడ విగ్రహ ఏర్పాటకు స్థలం ఎంపిక విషయంలో గత ఆరు రోజులుగా వివాదం నెలకొనడంతో కూటమి నాయకులు స్థానికులతో చర్చించి సమస్యను పరిష్కారించారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayudu) మాట్లాడుతూ రాధాకు ఉన్నత పదవి ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకే జనసేన పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. మంత్రి నిమ్మల స్పందిస్తూ రాధాకు సముచిత స్థానం ఇచ్చేందుకు అంతా కృషి చేస్తామని ప్రకటించారు.








