PPP: ఆదోని పీపీపీ టెండర్ మిస్టరీ..! మెడికల్ కాలేజీలపై నీలినీడలు!?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. ఒకవైపు ప్రతిపక్ష వైసీపీ హెచ్చరికలు, మరోవైపు ఇన్వెస్టర్ల నిరాసక్తి నడుమ మెడికల్ కాలేజీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా కిమ్స్ (KIMS) పేరిట జరిగిన ప్రచారం, ఆపై వచ్చిన ఖండన గందరగోళానికి దారితీసింది. ఆదోని మెడికల్ కాలేజీకి దాఖలైన ఏకైక టెండరు చుట్టూ ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలు ముసురుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో నిర్వహణకు ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లలో, కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే స్పందన లభించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ కిమ్స్ (KIMS) ఈ బిడ్‌ను దాఖలు చేసిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మిగిలిన మూడు కాలేజీలైన మార్కాపురం, మదనపల్లె, పాడేరులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, కనీసం ఒక్క కాలేజీకైనా ప్రముఖ సంస్థ ఆసక్తి చూపించిందని ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
కానీ, ఈ వ్యవహారంలో ఒక షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన, డాక్టర్ భాస్కరరావు నేతృత్వంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల చెైన్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) ఈ వార్తలను ఖండించింది. ఆదోని మెడికల్ కాలేజీ టెండరుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము బిడ్ దాఖలు చేయలేదని సంస్థ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తమది లిస్టెడ్ కంపెనీ అని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్టాక్ ఎక్సేంజీలకు అధికారికంగా తెలియజేస్తామని వెల్లడించింది.
హైదరాబాద్ కిమ్స్ సంస్థ ప్రకటనతో ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఆదోని కాలేజీకి టెండర్ వేసింది ఎవరు? ఒకవేళ పేరులో సారూప్యత ఉన్న వేరే ఏదైనా చిన్న సంస్థ టెండర్ వేసిందా? లేక ప్రభుత్వ వర్గాలే కిమ్స్ పేరును తెరపైకి తెచ్చాయా? అనే చర్చ ఇప్పుడు వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవేళ చిన్న సంస్థ టెండర్ వేసి ఉంటే, దానికి మెడికల్ కాలేజీని నిర్వహించే ఆర్థిక, సాంకేతిక సామర్థ్యం ఉందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ మొత్తం ఎపిసోడ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ విజయంగా అభివర్ణిస్తోంది. నాలుగు కాలేజీలకు గాను మూడింటికి అసలు టెండర్లే రాకపోవడం, వచ్చిన ఒక్కటి కూడా వివాదాస్పదం కావడానికి తమ అధినేత వైఎస్ జగన్ చేసిన హెచ్చరికలే కారణమని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. “ప్రభుత్వం మారితే పీపీపీ ఒప్పందాలను రద్దు చేస్తాం, ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం” అని జగన్ గతంలో ఇన్వెస్టర్లను గట్టిగా హెచ్చరించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలోనే బడా కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేశాయని, వేల కోట్ల పెట్టుబడి పెట్టి రేపు ప్రభుత్వం మారితే ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న ఉద్దేశంతోనే టెండర్లకు దూరంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం నిర్వహణ బాధ్యతలను మాత్రమే ఇస్తామని చెబుతున్నా, భవిష్యత్తులో వచ్చే చిక్కులను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ సీ ధోరణిని అవలంబిస్తున్నారు.
మరోవైపు, టెండర్ల ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేకపోయినా, పీపీపీ విధానంపై వెనక్కు తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. గుజరాత్ మోడల్‌ను అధ్యయనం చేసిన అనంతరం, మెడికల్ కాలేజీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. దీనికి తోడు, కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ ప్రాజెక్టులకు అండగా నిలుస్తోంది. ఇటీవల కేంద్రం పీపీపీ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణ సహాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో, ఏపీ సర్కార్ మరింత ఉత్సాహంగా ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక వెసులుబాటుతో మరిన్ని ప్రాజెక్టులను ఇదే బాటలో నడిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ప్రస్తుత టెండర్ల వైఫల్యం ప్రభుత్వానికి ఒక హెచ్చరికలా మారింది.
మొత్తానికి ఏపీ మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆదోని టెండర్ వేసిన అసలు సంస్థ ఎవరనేది బయటకు వస్తే గానీ ఈ మిస్టరీ వీడదు. మరోవైపు, మిగిలిన కాలేజీల కోసం ప్రభుత్వం నిబంధనలు సడలించి మళ్లీ టెండర్లు పిలుస్తుందా? లేక ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ప్రభుత్వమే సొంతంగా నిర్వహిస్తుందా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, పేదలకు అందాల్సిన వైద్యం, విద్యార్థులకు అందాల్సిన విద్య ఈ రాజకీయ, వాణిజ్య చదరంగంలో నలిగిపోకూడదన్నదే సామాన్యుడి ఆకాంక్ష.






