Posani Krishna Murali: కేసుల కన్ఫ్యూజన్ లో పోసాని..ఎట్టకేలకు బెయిల్ పై విడుదల..
టాలీవుడ్ ప్రముఖ నటుడు ,వైసీపీ (YCP) మాజీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా ఏపీకి చెందిన వివిధ జైళ్లలో ఉన్న ఆయన చివరికి శనివారం సాయంత్రం బెయిల్పై బయటకు వచ్చారు. గుంటూరు జైలు (Guntur Jail) నుంచి విడుదలైన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా పోసాని కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
పోసానిపై ఏకంగా 16 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) , మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) , జనసేన (Jansena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సహా వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొదట అన్నమయ్య జిల్లా పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, అనంతరం ఫిబ్రవరి 26న హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు.
అరెస్టైన తర్వాత పోసాని మొదట రాజంపేట జైలులో ఉంటే, ఆ తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు, కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు, చివరకు గుంటూరులోని సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో కేసులో కొన్నాళ్లు విచారణ జరిగిన తర్వాత ఆయన్ను వేరొక ప్రాంతానికి తరలించారు. అయితే కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు కాగా, మరికొన్నింటిలో మాత్రం ఇంకా విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు తాజాగా శుక్రవారం మరో కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో, శనివారం సాయంత్రం పోసాని విడుదల అయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనను పార్టీ నాయకులు పరామర్శించారు. తనపై నమోదైన కేసుల గురించి, జైల్లో గడిపిన అనుభవాల గురించి పోసాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే తాను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల కాస్త భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది. తన రాజకీయ వ్యాఖ్యలే ఇప్పుడు తనకు ఇబ్బందిగా మారాయని ఆయన సన్నిహితుల చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆయన భవిష్యత్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.













