Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి కేసు లో ట్విస్ట్ లు.. బెయిల్ పై అనిశ్చిత..
సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress party) పార్టీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా జైలులో ఉన్న ఆయన అనారోగ్యంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. గుంటూరు కోర్టు ముందు ఆయన భావోద్వేగంతో మాట్లాడి, తన వయసును, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని విడిచిపెట్టాలని కోర్టును వేడుకున్నారు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను స్వీకరించలేదు. సీఐడీ (CID) నమోదు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో, మరోసారి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
పోసాని గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 17 కేసులు ఉన్నట్టు సమాచారం. కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ, మరికొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు కొంతమేర నోటీసులు జారీ చేసినప్పటికీ, సీఐడీ మరో కేసులో ఆయనను పీటీ వారెంట్ పై కోర్టుకు హాజరుపరచడంతో, విడుదల ఇంకా ఆలస్యమవుతోంది.
కర్నూలు జైలులో ఉన్న పోసాని, విచారణ నిమిత్తం గుంటూరుకు తరలించబడ్డారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, రాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ సమయంలో ఆయన తీవ్రమైన భావోద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది. తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఇప్పటికే రెండు ఆపరేషన్లు జరిపించుకున్నానని కోర్టులో వివరించారు. ఇలాంటి పరిస్థితిలో జైల్లో కొనసాగడం తన ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పినట్టు సమాచారం. తనను విడుదల చేయకపోతే, ఆత్మహత్యే శరణ్యమని కూడా భావోద్వేగపూరితంగా వ్యాఖ్యానించారని చెబుతున్నారు.
అయితే కోర్టు, న్యాయపరమైన నిబంధనల ప్రకారం ఆయనను ఇంకా జైలులోనే ఉంచాలని నిర్ణయించడంతో, పోసాని మానసికంగా మరింత కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయనపై మరో కొత్త ఫిర్యాదు బాపట్ల పోలీసులకు అందినట్టు సమాచారం. ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదై ఉండటంతో, కావాలనే వేధింపులు చేస్తున్నారని పోసాని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పరిణామాల వల్ల పోసాని తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు, చుట్టూ జరుగుతున్న ఘటనల కారణంగా ఆయన మరింత కంగారు పడుతున్నారని టాక్ . ప్రస్తుతం ఆయనకు బెయిల్ మంజూరవుతుందా? లేకపోతే మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి వస్తుందా? అనే అంశంపై అందరి దృష్టి ఉంది.













