Minister Narayana: ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు : మంత్రి నారాయణ

విజయవాడ నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొనేందుకు దృష్టి పెట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ (Diarrhea Medical Camp) ను మంత్రి పరిశీలించారు. నూతన ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల నివేదికలు వస్తాయన్నారు. రిపోర్టులు (Reports) వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డయేరియాకు కారణం తాగునీరా (Drinking water) లేదా ఫుడ్ పాయిజన్ అన్నది స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 15 వేల వాటర్ క్యాన్ల ద్వారా తాగు నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 150 మంది చికిత్స తీసుకుని ఇంటికెళ్లారని వివరించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని సూచించారు.