ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన బోట్ల వెనుక కుట్ర కోణం దాగి ఉందా?
ఓవైపు బుడమేరు.. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ వరదతో అతలాకుతలం అయింది. వరద నీటి కారణంగా విజయవాడలోని చాలా కాలనీలు మునిగిపోయాయి.. సరిగ్గా అదే సమయంలో కృష్ణా నదిలోని బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన విషయం పెను సంచలనంగా మారింది. వరద ముంపులో అల్లాడుతున్న సమయంలో ఈ బోట్ల సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రకాశం బ్యారేజీ లోని 67, 69, 70 గేట్లు ఈ బోట్ల కారణంగా దెబ్బతిన్నాయి. గేట్లకు కౌంటర్ వెయిట్ లు ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని కట్టడి చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఇది సహజంగా జరిగిన దుర్ఘటన కాదని ఎవరో కావాలని చేసిన పని అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీని బోట్లు ఢీ కొట్టిన సంఘటనలో కుట్ర కోణం ఉందంటూ చంద్రబాబుకు నివేదిక అందించారు. ఇప్పటివరకు ఈ బోట్లకు సంబంధించిన యజమానులు ఎవరు ముందుకు రాకపోవడం ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తోంది.
మరో పక్క బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లు.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు సంబంధించినవి అని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు సంబంధించిన బోట్లుగా వీటిని అధికారులు గుర్తించారు. ఉషాద్రికి అనే వ్యక్తికి చెందిన ఈ బోట్లను ఇసుకను అక్రమంగా రవాణా చేయడం కోసం సురేష్ ఉపయోగించే వాడట. బ్యారేజీని ఢీ కొట్టిన బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా యజమానులను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 , AP-IV-M-SB-0017 నెంబర్లున్న మూడు బోట్లతో పాటు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన మరొక రెండు బోట్లు కూడా వైసిపి నేతల అనుచరులైన ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీ లకు చెందినవని తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ ఉష్రాది తనకు చెందిన మూడు బోట్లను ఒకటిగా కలిపి కట్టడం వెనక కుట్ర కోణం ఉంది అని భావిస్తున్నారు.
ఎందుకంటే సహజంగా ఇలా ఎవరు చేయరు. అందరూ ఇనుప చైన్లలు ఉపయోగిస్తే వీరు మాత్రం ప్లాస్టిక్ తాడ్లతో బోట్లను కట్టారు. తాము వారిస్తున్న కావాలని ప్లాస్టిక్ తాడ్లతో బోట్లు కట్టారని స్థానికులు వెల్లడించారు. ఒకవేళ గేట్లు పగిలిపోయి ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో ఆలోచించడానికి భయం కలుగుతుంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.













