Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు చారిత్రక గుర్తింపు.. పొట్టి శ్రీరాములు పేరుపై పవన్ సూచన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అత్యంత కీలకమైన బహుళోద్దేశ్య ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గుర్తింపు పొందింది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలను ఒకేసారి తీర్చే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది. తొలి దశ పనులు 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్న అంచనాల మధ్య, ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోలవరం ప్రాజెక్టుపై తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ఈ ప్రాజెక్టుకు పేరు మార్చాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) పేరును పెట్టాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఆయన త్యాగానికి తగిన గౌరవం లభిస్తుందని, రాబోయే తరాల వరకు ఆయనను గుర్తు చేసుకునే అవకాశం ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను ప్రభుత్వ స్థాయిలో చర్చకు తీసుకువెళ్లి, పోలవరం ప్రాజెక్టును అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాజెక్టుగా పేరు మార్చేలా ప్రయత్నిస్తానని పవన్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులతో నిర్వహించిన ఒక పదవి బాధ్యతల కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలవరం ప్రాజెక్టుకు గతంలో వివిధ దశల్లో పేర్లు మారిన చరిత్ర ఉంది. పనులు ప్రారంభమైన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో దీనికి ఇందిరా సాగర్ (Indira Sagar) అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థానిక భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాంత ప్రజలు, గిరిజనులు త్యాగం చేసిన భూములతో నిర్మితమవుతున్నదని పేర్కొంది. అందుకే ఇందిరా సాగర్ పేరును తొలగించి, పోలవరం ప్రాజెక్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2014లో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
తరువాత కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు వైఎస్ ఆర్ ప్రాజెక్టు అని పేరు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ, స్థానికంగా అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయం అమలుకాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తాజా ప్రతిపాదన కొత్త చర్చకు దారితీసింది.
ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సూచనలతో కొన్ని పథకాలకు ప్రముఖుల పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కాసీతమ్మ (Dokka Seethamma) పేరు పెట్టడం, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం సహా అవసరమైన వస్తువులు అందించే పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) పేరు పెట్టడం ఆయన ఆలోచనల ఫలితమే. ఇప్పుడు అదే తరహాలో పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.






