Pithapuram Varma: నాగబాబు వ్యాఖ్యలపై వర్మ కౌంటర్..పిఠాపురంలో పొలిటికల్ వార్ షురూ అవుతుందా..
పిఠాపురంలో (Pithapuram) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలుపు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నామినేట్ అయిన నాగబాబు (Nagababu) ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. పవన్ విజయంలో ఎవరి పాత్ర లేదని, ఎవరికైనా తాము గెలిపించామని అనిపిస్తే అది వారి “కర్మ” అని వ్యాఖ్యానించడం వల్ల టీడీపీ (TDP ) వర్గాల్లో ఆగ్రహం కలిగించింది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ఎంతో శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మను ఈ మాటలు నొప్పించడం సహజం.
వర్మ గత ఎన్నికల్లో చంద్రబాబుకు(Chandrababu ) ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలుపు కోసం పనిచేశారు. పవన్ విజయం సాధించడానికి వర్మ చేసిన కృషిని డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ స్వయంగా గుర్తించారు. అయితే ప్రభుత్వంలో పదవి వస్తుందని ఆశించిన వర్మకు ఇప్పటివరకు ఎటువంటి అవకాశం దక్కలేదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో వర్మకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనుకున్నప్పటికీ, అది ఇంకా జరుగలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు సీటు పొందడాన్ని వర్మ అనుచరులు మౌనంగా చూసినా, మదిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటికే పదవి రాలేదన్న నిరాశ వర్మ వర్గంలో ఉండగా, తాజాగా జరిగిన జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మంట రాజేశాయి. ఆయన మాటలు వర్మ అనుచరులకు మరింత నిరాశను కలిగించాయి. దీనిపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు చేస్తోంది. వర్మ పిఠాపురంలో బలమైన నాయకుడని, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కూడా విజయం సాధించిన వ్యక్తి అని గుర్తు చేస్తూ, ఆయన కృషిని చిన్నచూపు చూడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వర్మ తొలిసారిగా స్పందించారు. ఎవరి పేర్లను ప్రస్తావించకుండా, తాను సీఎం చంద్రబాబునాయుడి సైన్యంలో ఒక సైనికుడిని, ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తానని అన్నారు. తన ప్రభావం తగ్గిందని చెప్పేవారికి తాను సమాధానం ఇవ్వనని, కానీ ప్రజల కోసం ఎప్పుడూ పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను ఎవరూ భయపెట్టలేరని, ఎవరైనా తనను తొక్కిపెట్టాలనుకుంటే అది సాధ్యం కాదని అన్నారు.
వర్మ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా నాగబాబును ఉద్దేశించినవిగా కనిపించకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా వర్మ కృషిని గుర్తించి పదవి ఇచ్చి ఉండాల్సిందనేది టీడీపీ వర్గాల భావన. కానీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్మకు తగిన గుర్తింపు రాకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది. నాగబాబు వ్యాఖ్యలు ఈ నిరాశను మరింత పెంచినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వర్మ తన స్థానాన్ని, తన పని తీరు, తన నిబద్ధతను జనానికి చాటిచెప్పేలా తన మాటలను సమర్థంగా వినిపించారు. ఇది జనసేన, టీడీపీ మద్య సంబంధాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఎలా మారుతాయనేది చూడాలి.













