Pulivendula: తొలిసారి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న ప్రజలు
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ ఎన్నికలు (ZPTC Elections) పలుమార్లు జరిగినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ప్రజలకు నిజంగా ఓటు వేసే అనుభవమే లేదు. హక్కు ఉన్నా, బూత్ దాకా వెళ్లాల్సిన అవసరం రాకుండా ఎప్పుడూ ఏకగ్రీవంగానే ముగిసిపోయేవి. వైఎస్సార్ కుటుంబం (YSR family) ఆధిపత్యం ఇక్కడ అంతగా ఉండటంతో ప్రత్యర్థి పార్టీలు పోటీకి సాహసించేవి కావు. పోటీ చేయాలనుకున్నా, చివరి నిమిషంలోనే తప్పుకుంటారు. ఇలా ఇప్పటివరకు వైయస్ కుటుంబీకులకు కంచుకోటలా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మాత్రం ఎన్నికల వేడి గట్టిగా కనిపిస్తోంది.
1995 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కుటుంబం ఆధిపత్యం కొనసాగింది. 2001, 2006, అలాగే 2021లో కూడా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పాలనలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. తొలిసారిగా టీడీపీ (TDP) ఈ బలమైన కోటలో సవాల్ విసిరింది. ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరగేలా చేసింది.
ఈ పోటీలో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. టీడీపీ కూటమి పూర్తి శక్తితో రంగంలోకి దిగింది. ఇన్నాళ్లూ ఓటు వేయని వారు కూడా ఈసారి తప్పకుండా తమ ఓటు వేయాలని పిలుపునిస్తోంది. వైఎస్సార్ కుటుంబం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తోంది. తమ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిపి చేస్తామంటూ హామీలు ఇస్తోంది. పులివెందులలో మొదటిసారి టీడీపీని గెలిపిస్తే, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెబుతోంది.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి ఇది ఒక కఠిన పరీక్షగా మారింది. 2021లో ఇక్కడి నుండి గెలిచిన మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు హేమంత్ రెడ్డి (Hemant Reddy) ని బరిలోకి దింపింది. సానుభూతి ఓటు తమవైపు వచ్చేలా ప్రయత్నిస్తోంది. కానీ అధికార బలమే కాకుండా వ్యూహాలతో దూసుకెళ్తున్న టీడీపీ కూటమి ప్రతీ చోటా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది.
ఇక కూటమి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లోని కొన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను తమ పార్టీలోకి రప్పించుకుంటూ బలాన్ని పెంచుకుంటున్నారు. తమ లక్ష్యం స్పష్టంగా ఉంది – ఈ సీటును గెలిచి, నేరుగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కి గిఫ్ట్‌గా ఇవ్వడం. ఇప్పటివరకు ఎన్నడూ చూడని స్థాయిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కురుక్షేత్ర పోరును తలపిస్తోంది. ఇరువైపులా శక్తివంతమైన ప్రచారం, కఠినమైన వ్యూహాలు, స్థానిక రాజకీయ ఉత్కంఠ – ఇవన్నీ కలిసివచ్చి ఈ ఎన్నికను ప్రత్యేకంగా మార్చేశాయి. ఎప్పుడూ ఏకగ్రీవానికి చిహ్నంగా ఉన్న ఈ స్థలం, ఈసారి ఎవరి వైపు ఫలితం మొగ్గుతుందో అన్నది ఆసక్తిగా మారింది.







