పోలింగ్ బహిష్కరించిన వినూత్నంగా నిరసన తెలిపిన గ్రామస్తులు..
ఎన్నికల పోలింగ్ సమయంలో సహజంగా ఎక్కువ ఓట్లు నమోదైన పోలింగ్ సెంటర్ వైరల్ అవ్వడంతో పాటు వార్తల్లోకి ఎక్కుతుంది. అయితే అసలు పోలింగే లేకుండా.. పోలింగ్ కేంద్రాన్ని బహిష్కరించి నిరసన చేపట్టి వినూత్నంగా తెలంగాణలోని ఒక పోలింగ్ కేంద్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈ పోలింగ్ కేంద్రం ఎక్కడో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్కర్నూల్ లోని కొల్లాపూర్ మండలం లోనిది. అమరగిరి చెంచు గూడెం లోని గ్రామస్తులు మూడు రోజులుగా కరెంటు లేక విపరీతమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గ్రామానికి రోడ్డు, మంచినీరు, రేషన్ కార్డులు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు అస్సలు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వారు ఉండేది నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని.. కరెంటు లేకపోవడంతో పాము కాట్లకు గురి కావలసి వస్తుందని పేర్కొన్నారు.
కేవలం కరెంటు బిల్లులు మాత్రం అడగడానికి వచ్చే విద్యుత్ అధికారులు.. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. ఎన్నికల పోలింగ్ సందర్భంలో ఒకే తాటిపై వచ్చిన అందరూ.. ఐకమత్యంగా ఓటు వేయకుండా పోలింగ్ ను బహిష్కరించారు. ఈ విషయాన్ని పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియపరచడంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెంచుగూడెంకు చేరుకున్నారు. మొత్తానికి నిరసన వ్యక్తం చేసి వినూత్నంగా తమ సమస్యను పరిష్కరించుకున్న గ్రామస్తుల ఐకమత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.













