Pawan Kalyan: సినిమాలకు పవన్ బ్రేక్..! ఇకపై రాజకీయాలే..!!
సినిమా గ్లామర్, రాజకీయ అధికారం ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడం ఏ సెలబ్రిటీకైనా కత్తి మీద సామే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)విషయంలో ఈ చర్చ ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. అయితే, తాజాగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నుండి వచ్చిన ఒక అధికారిక ప్రకటన టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తోంది. ఇకపై కొత్త సినిమాలకు పవన్ కల్యాణ్ బ్రేక్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆయన పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలైంది. ఈ సక్సెస్ జోష్‌లో ఉండగానే, ఆయన తదుపరి చిత్రాల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. హరీష్ శంకర్, దేవ కట్టా, మోహన్ రాజా, సురేందర్ రెడ్డి వంటి అగ్ర దర్శకుల పేర్లు వినిపించాయి. కొందరు దర్శకులు స్క్రిప్ట్‌లు కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ రూమర్లన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టింది. “ప్రస్తుతానికి కొత్త కమిట్మెంట్స్ ఏవీ లేవు.. వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు” అని స్పష్టం చేయడమే కాకుండా, ‘ఓజీ 2’ గురించి అప్డేట్ ఉంటే స్వయంగా పవనే చెబుతారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. ఆయన రాజకీయ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే అని అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి
గత ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. కేవలం నామమాత్రపు రాజకీయ నాయకుడిగా కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు జనసేన కమిటీలను పటిష్టం చేయాలనుకుంటున్నారు. రాజకీయాల్లో గ్యాప్ ఇస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టేనని భావిస్తున్న పవన్, ఇకపై నిరంతరం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
తమ అభిమాన హీరోను వెండితెరపై చూసుకోవాలని ఆశపడే ఫ్యాన్స్‌కు ఈ వార్త కొంత నిరాశ కలిగించినా, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ‘ఓజీ 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసే వారు ఉన్నప్పటికీ, పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయి నాయకుడిగా ఎదగాలన్నది మెజారిటీ అభిమానుల ఆకాంక్ష. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల కోసం కేటాయించే 20-30 రోజుల సమయాన్ని కూడా ఇప్పుడు రాజకీయ చర్చలకు, ప్రజా యాత్రలకు కేటాయించబోతున్నారు.
సినిమాల వల్ల వచ్చే కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను పక్కన పెట్టి, కేవలం ప్రజల కోసం, పార్టీ కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన నిబద్ధతను చాటుతోంది. ‘పార్ట్ టైమ్ పాలిటిక్స్’ అనే ముద్రను చెరిపివేసి, ‘ఫుల్ టైమ్ లీడర్’గా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ తాత్కాలిక సినిమా విరామం జనసేన పార్టీకి ఎలాంటి మైలేజ్ ఇస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి







