Janasena: జనసేన ఆవిర్భావ సభ కూటమిలో చిచ్చుకి ఆరంభం అవుతుందా?
జనసేన ఆవిర్భావ సభ (Janasena formation day) తరువాత ఆ పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూటమిలో అనేక ప్రశ్నలకు దారితీశాయి. తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) రాజకీయంగా బలమైన పార్టీ. దానికి మునుపటి నేతలు ఎన్టీఆర్ (NTR) , చంద్రబాబు (Chandrababu ) వేసిన పునాదులు గట్టి కాండంగా ఉన్నాయి. ఈ పార్టీ అధికారాన్ని సాధించడమే కాదు, దాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా చూపించింది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఏకంగా మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను (Congress) ఓడించడం అప్పట్లో సంచలనం. ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మరింతగా బలోపేతం అయింది. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర పాలనను నడిపించిన ఘనతను సాధించారు.
అలాంటి తెలుగు దేశానికి జనసేన మద్దతు అవసరమా? లేక జనసేన టీడీపీకి సహాయపడిందా? అనే చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన నేతలు తమ మద్దతు వల్ల కూటమికి విజయమొచ్చిందనే తరహాలో మాట్లాడటంపై టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ. ఎన్నో కష్టాలను తట్టుకుని ముందుకు వచ్చిన పార్టీ. అలాంటి పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే అని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ కార్యకర్తలు జనసేన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కూటమి గెలుపు అందరి సమిష్టి కృషితో సాధ్యమైందని ఒప్పుకోవాలి కానీ జనసేన మద్దతు వల్ల మాత్రమే విజయమొచ్చిందన్న భావన వ్యాప్తి చెందితే సమస్యలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా జనసేన నాయకుల కొందరు మిత్రపక్ష పార్టీ గురించి మాట్లాడే తీరు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. మేమే అందరినీ గెలిపించాం అనే మాటలు మితిమీరిన ఆత్మస్థుతి అనిపిస్తున్నాయని, ఇది కూటమికి మేలుకానిదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎదురైన షాకింగ్ రిజల్ట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోంది. అప్పట్లో టీడీపీ మద్దతు లేకపోవడంతో జనసేన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ సహకారంతో మళ్ళీ రివైవ్ అయ్యింది. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్ తమ ఆగ్రహాన్ని బయటపెడుతోంది. కూటమి అంటే పరస్పర గౌరవం ఉండాలి కానీ ఒక పార్టీ తానే గెలిపించిందని చెప్పడం హుందాతనానికి విరుద్ధమని అంటున్నారు.
ఇది ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు కొత్తగా చర్చ నడుస్తోంది. ఆయన పార్టీకి స్వతంత్ర గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నారా? లేక టీడీపీ సహాయంతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కూటమి ఒక్కటే కీలకమని, అసలు దాని సుస్థిరతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన మిత్రపక్షంతో సంబంధాలు మరింత బలంగా చేసుకోవాలంటే పార్టీ నాయకుల వ్యాఖ్యలపై నియంత్రణ అవసరం. ఇకపై జనసేన-టీడీపీ మధ్య మాటల తూటాలు ఇంకా ఎలాంటి మార్పులకు దారి తీస్తాయో చూడాలి.













