విజయవాడలోనే పాస్ పోర్టుల ముద్రణ
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రజలకు ఇక విజయవాడలోనే పాస్‌పోర్టులు ముద్రించేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే విశాఖ నుంచి తపాలాలో వచ్చే పాస్‌పోర్టుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇక ఉండదు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నంలో మాత్రమే ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో విజయవాడలో 2017లో ఏప్రిల్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభమైంది. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ప్రజల సౌలభ్యం కోసం తరువాత తిరుపతిలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తరువాత కర్నూలు, కడప, నెల్లూరులో తపాలా కార్యాలయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఎనిమిది జిల్లాల ప్రజలు పాస్‌పోర్టు కోసం ముందస్తు, తదనంతర ప్రక్రియను సమీపంలోని సేవా కేంద్రాల్లో పూర్తి చేయగలుగుతున్నారు. వీటి ముద్రణ వ్యవస్థ ప్రస్తుతం విశాఖపట్నంలో మాత్రమే ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే తపాలాలో పాస్‌పోర్టులు జారీ చేస్తున్నారు. విజయవాడలో వీటి ముద్రణకు అనుమతులివ్వడంతో ఇక నుంచి ఒకటి, రెండు రోజుల్లోనే పాస్‌పోర్టులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం కేంద్ర విదేశీ వ్యవహారశాఖ ఇప్పటికే అనుమతులివ్వడంతో ఇందుకోసం తగిన భవన అన్వేషణలో అధికార వర్గాలున్నాయి.













