ఏపీ పోదాం.. చలో చలో..

ఏపీలో ఓట్ల పండుగ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది. ఏపీకి వెళ్లే ప్రైవేటు బస్సులు, రైళ్లలో ఇప్పటికే సీట్లు ఫుల్‌కావడంతో రిజర్వేషన్ టికెట్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండటంతో బస్టాండ్లకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో మియాపూర్, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
ఓటేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్ ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సులతో పాటు ఇతర వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. విజయవాడకు ఏకంగా రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ అందుబాటు ధరల్లోనే టికెట్లను విక్రయిస్తోంది. మరిన్ని బస్సులు పెంచితే బావుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.
అయితే.. ధర ఎంతైనా సరే ఊరికి పోయి వస్తామంటున్నారు ఏపీలోని ప్రజలు. ఎందుకంటే చాలా వరకూ వారి సొంతూరిలోని పార్టీ నేతలు.. ముందుగానే టికెట్లు బుక్ చేసి పెట్టారు. కొందరికి బస్సు టికెట్ తో పాటు మనీ ముట్టచెబుతుంటే..మరికొందరికి మాత్రం బస్సు టికెట్ ఇస్తున్నారు. దీంతో ఊరికి వెళ్లి తమ పార్టీకి, తమ అభిమాన నాయకుడికి ఓటేస్తామని బయలుదేరుతున్నారు ఏపీ వాసులు. మరోవైపు ఊరి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని..బయలుదేరారా లేదా అని అడుగుతున్నారని చెబుతున్నారు.
ఈ ఎన్నికలు అధికార వైసీపీ, విపక్ష కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒక్క ఓటు చాలు ఫలితాన్ని తారుమారు చేసేందుకు.. దీంతో ఎంతైనా సరే వెచ్చించి, తమకు ఓటు పడేలా చూసుకుంటున్నారు నేతలు. దీంతో ఆంధ్రలోని సొంతూరికి పోతున్నారు ప్రజలు. అలా ఓటేయడం, ఇలా సొంతవారిని చూసుకునిరావడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంటే వన్ షాట్ ఎట్ టు బర్డ్స్ అన్నమాట.