పొత్తుల పద్మ వ్యూహం.. ఇరకాటంలో చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న వేడి రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా పొత్తు కన్ఫర్మ్ అయ్యాక రాయలసీమకే కీలకమైన అనంతపురం జిల్లా రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గం లో పరిస్థితులు రంజుగా మారాయి. ప్రస్తుతం టీడీపీ తరఫున దివంగత మంత్రి పరిటాల రవి కొడుకు శ్రీరామ్.. ధర్మవరం నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. అయితే పొత్తులు పూర్తయ్యాక కొత్తగా రంగంలోకి దిగిన బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి.. అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ టికెట్ ఆశిస్తున్నారు. ఎటు చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. వరదాపురం సూరి మరెవరో కాదు ఒకప్పుడు పరిటాల రవి ప్రధాన అనుచరుడు. 2009,2014,2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇదే ధర్మవరం నుంచి పోటీ చేసి అతను ఓటమి పాలయ్యాడు.
ఆ తర్వాత తెలుగుదేశం వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ ధర్మవరం టీడీపీ కార్యకలాపాలను ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీతను ప్రకటించడం జరిగింది. కూటమి కారణంగా ఇప్పటికే సీట్ల విషయంలో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇచ్చే ఉదేశం లో చంద్రబాబు ఉన్నారు. ఒక బాబు కుటుంబానికి తప్ప ఇంతవరకు మరే కుటుంబానికి రెండో టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్య పరిటాల శ్రీరామ్ కు నిరాశే మిగులుతుంది అని టాక్ నడుస్తోంది.













