అలయెన్స్ పై క్లారిటీ వచ్చేసిందా?
ఏపీ రాజకీయ ముఖచిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో తమతో బీజేపీ కలిసి వచ్చే అవకాశం లేకపోవచ్చని సాక్షాత్తూ సీఎం జగన్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెత్తందారీ భావజాలానికి, పేదల ప్రభుత్వానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందన్నారు. 2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేసే డీబీటీకి… దోచుకో.. పంచుకో.. తినుకోకి మధ్య యుద్ధం.. సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి జరుగుతున్న యుద్ధం.. స్కాములు, స్కీముల మధ్య యుద్ధం. ఇది జగన్తో కాకుండా పేదలతో యుద్ధం అని గుర్తుంచుకోవాలన్నారు..
మరోవైపు వైసీపీ మంత్రులు సైతం.. బీజేపీపై సెటైర్లు వేశారు. విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇద్దరు భాజపా అగ్రనేతలు చౌకబారు ఆరోపణలు చేశారని విమర్శించారు. టీడీపీ సానుభూతి పరులైన నేతలను పక్కన పెట్టుకుని ఇద్దరు నేతలు మాట్లాడారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చూశాక.. ప్రధాని మోదీ, అమిత్ షాల మధ్య విభేదాలు వచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ప్రధాని మోదీ నోటి వెంట జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని మంత్రులు గుర్తు చేశారు.. గతంలో చంద్రబాబు దిల్లీ వెళ్తే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయి. గతంలో పోలవరం నిధులు ఏటీఎమ్ కింద వాడేస్తున్నారని స్వయంగా మోదీ విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, అమిత్ షా, మోదీల మధ్య విభేదాలు వచ్చినట్లున్నాయన్నారు. బీజేపీ, టీడీపీ కలిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా ఉంటుందని సెటైర్ వేశారు.
బీజేపీ తమకు అండగా ఉండకపోవచ్చని జగన్ పరోక్షంగా వ్యాఖ్యానించడం … వైసీపీలో కలవరం రేపుతోంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలసికట్టుగా పోటీ చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న ఆందోళన ఆపార్టీ నేతల్లో కనిపిస్తోంది. అదే ఖాయమైతే తమ పరిస్థితి ఏమిటన్న విషయంపై .. వైసీపీ ఎమ్మెల్యే ఆదుర్దా కనిపిస్తోంది. సంక్షేమపథకాలు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా అన్న అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.













