R.K.Roja: తన మాటలకి పశ్చాత్తాపం లేదన్న రోజా…విమర్శిస్తున్న నేటిజెన్లు..

నగరి (Nagari) నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (R.K. Roja)పై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలు సాధారణమే అయినా, ఈసారి మాత్రం రోజా భావోద్వేగానికి లోనయ్యారు. సాక్షి టీవీలో (Sakshi TV) నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లు అదుపు చేసుకోలేకపోయారు.
ఆమెపై జరిగిన వ్యక్తిగత వ్యాఖ్యలకు వైసీపీ (YCP) శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు దీన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో గట్టిగానే స్పందించారు. “ఒక మహిళపై ఇంత అవమానకరంగా ఎలా మాట్లాడతారు?” అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే మరోవైపు టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల నేతలు మాత్రం రోజాపై ఎదురుదాడికి దిగారు. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనకు సంబంధించిన పాత వీడియోలు వెలుగులోకి తెచ్చారు. “ఇప్పుడు తాను బాధపడుతున్నట్లు నటించడం కేవలం సింపతి కోసం” అని విమర్శించారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రముఖ ఛానెల్ ఆమె చేసిన వ్యాఖ్యలన్నింటినీ వీడియో రూపంలో చూపిస్తూ స్పందన కోరగా, రోజా అన్నింటికీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
నారా లోకేష్ (Nara Lokesh)ను “పప్పు” అన్న విషయంపై స్పందిస్తూ, “ఆయన కేవలం చంద్రబాబు కొడుకుగా ఎటువంటి అర్హత లేకుండా మంత్రి అయ్యారు, రాష్ట్రానికి నష్టం చేశారు” అని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, “ఆయన స్వంతంగా గెలవలేరు, ఒక నాయకుడిగా ఎదగాలంటే నిజంగా పోటీ చేయాలి” అని అన్నారు. తాను నటిగా, ఎమ్మెల్యేగా వ్యవహరించిన తీరు మీద విమర్శలు వచ్చినప్పుడు కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. “చిరంజీవి (Chiranjeevi) ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో నటించిన స్టెప్పులే నేను వేసాను. ఆయన చేస్తే అందరికీ బాగానే అనిపించింది, కానీ నేను చేస్తే తప్పా?” అని ప్రశ్నించారు.
రోజా మాటల్లో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదు. తాను మహిళ అనే దృష్టికోణంలో విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. అయితే రోజా ప్రవర్తన, ఆమె మాట్లాడిన విధానం చాలామందికి నచ్చలేదు. కేవలం మహిళా అనే ఒక పాయింట్ ని ఆధారం చేసుకొని తనని ఎవరు ఏమీ అనకూడదు అని మొండిగా వాదించే రోజా.. గతంలో అందరినీ విమర్శించారు. కానీ తనవరకు వచ్చేసరికి సింపతి కోసం ఇలా చేస్తున్నారు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి..