మాతృ భాషను మరిచిపోతే కన్న తల్లిని మరచిపోయినట్టే
మాతృ భాష తెలుగును మరచిపోతే కన్న తల్లిని మరచిపోయినట్లేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడికిపోయినా తెలుగే మన ఉనికిని చాటుతుందన్నారు. ఇక్కడి ప్రజలకంటే విదేశాల్లో ఉన్న వారికే భాషాభిమానం ఎక్కువగా ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా ఆచరిస్తారని తెలిపారు. తెలుగు వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవిదేశాల్లో చాటిన నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టమన్నారు. తమ పార్టీ పేరులోనే తెలుగుందని, ప్రజలకు తమ పార్టీ శాశ్వతంగా గుర్తుండిపోవాలనే ఎన్.టి.రామారావు ఈ పేరును సూచించారన్నారు.
సిలికాన్ వ్యాలీలో అత్యధిక సంపాదన కలిగిన వారు మన తెలుగువారే అని చెప్పుకునేందుకూ గర్వంగా ఉందని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సాధికారత సంస్థ, ఏడు అకాడమీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినప్పుడు తెలుగు వారి సంస్కవృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక చిహ్నాలు చెన్నై వస్తు ప్రదర్శనశాలల్లో ఉండిపోయాయన్నారు. విభజన సందర్భంగా తెలంగాణలో ఉండిపోయిన మన పుస్తకాలు, జ్ఞాపికలను తిరిగి మన రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో భాషా కోవిదులు, సాహితీవేత్తలు, భాషా సేవకులు పలువురికి పురస్కారాలు అందజేశారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనవళ్లను సత్కరించారు.













