Nara Lokesh: మోదీ, చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది : మంత్రి లోకేశ్

గతంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ (Google) పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అమరావతిలో లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ (Visakhapatnam)కు వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. గూగుల్ పెట్టుబడితో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖవచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం. ఇది జరిగిన నెల రోజుల్లో యూఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశా. నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు (Chandrababu) అనేకసార్లు భేటీ అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది. భారీ పెట్టుబడులపై అన్ని చోట్లా చర్చలు జరుగుతున్నాయి అని తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఏ ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లే పరిస్థితి రాదు. గత ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఢల్లీిలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది అని అన్నారు.