ఏపీకి బాబే బ్రాండ్ అంబాసిడర్
ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన వల్లనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి రాష్ట్రంలో ఉన్న ఐటీ, పరిశ్రమలు తెలంగాణాలోనే ఉండిపోయాయని అన్నారు. నాలుగేళ్లలో 721 మెగా కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వీటి ద్వారా 1 లక్షా 49 వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందన్నారు. మెగా పరిశ్రమల ద్వారా 2 లక్షల 27 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. 23వేల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. గడిచిన నాలుగేళ్లలో 5 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. ఎంవోయూలు కార్యరూపం దాల్చడంలో కూడా రెండవ స్థానంలో ఉన్నామన్నారు. గుజరాత్‌కు మనకూ కేవలం రెండు ఎంవోయులు మాత్రమే తేడా అన్నారు.













