ఫేస్ బుక్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తామని ఫేస్బుక్ (ఇండియా) హెడ్ ఆఫ్ కనెక్టివిటీ పాలసీ అశ్వినీ రాణా పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకునే విధంగా డిజిటల్ శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. అశ్వినీ రాణాతో పాటు ఇతర ఫేస్బుక్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో ఫేస్బుక్ మరింతగా విస్తరించేందుకు ఫైబర్‌గ్రిడ్ ఉపయోగపడుతుందన్నారు. ఇంటర్నెట్ ప్రజలకు ప్రాథమిక హక్కుగా మారబోతోందని, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. నూతన టెక్నాలజీతో ఏపీలో ఫైలట్ ప్రాజెక్టులు చేయాలని కోరారు. ఫైబర్‌నెట్ ద్వారా గ్రామాల్లోని ఇళ్లల్లో తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. దీనికి ఫేస్బుక్ సహకారం ఉండాలని, ఫైబర్‌గ్రిడ్ వేదికగా వైఫై సేవలు విస్తరించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని అశ్వినీ రాణా హామీ ఇచ్చారు.













