TDP Mahanadu: టీడీపీ మహానాడులో కీలక మార్పులు ..నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు..
తెలుగుదేశం పార్టీకి మహానాడు (TDP Mahanadu) చాలా ముఖ్యమైంది, ఇది కేవలం ఒక సభ మాత్రమే కాదు, పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కార్యక్రమం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (NTR) ప్రారంభించిన ఈ ఆచారం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది. పార్టీలో మార్పులు, సంస్కరణలు, పాలన వ్యూహాలు ఇవన్నీ మహానాడు వేదికగానే నిర్దేశించబడతాయి. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో దీన్ని నిర్వహించినా, ఈ సారి మాత్రం కడపను (Kadapa) వేదికగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా వైయస్ కుటుంబానికి కంచుకోట ఆయన పులివెందులను (Pulivendula) ఎంపిక చేయడం రాజకీయంగా చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది.
కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం టీడీపీ (TDP ) చరిత్రలోనే తొలి సారి. దీనికి మహా ప్రాముఖ్యత ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ పులివెందులలో నిర్వహిస్తే, అది ఓ చరిత్రాత్మకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌కు (Jagan) సొంత నియోజకవర్గం కావడంతో, ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, అక్కడ వేదిక ఎలా ఉండబోతోందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా, ఎక్కడ నిర్వహించినా, ఈ మహానాడు ద్వారా పార్టీకి కొత్త ఊపును తీసుకురావాలనే ఆలోచనతో టీడీపీ నాయకత్వం ముందుకెళ్తోంది.
ఈ మహానాడు వేదికగానే నారా లోకేష్‌కు (Nara Lokesh) కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీని ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరింత బాధ్యత కలిగిన పదవిని ఇచ్చే అవకాశముందని అంటున్నారు. గతంలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినా, అప్పుడు కార్యరూపం దాల్చలేదు. కానీ, ఈసారి మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అలాగే, ఈ మహానాడు వేదికగా టీడీపీ భవిష్యత్తు పట్ల కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా పాత తరం నాయకుల స్థానంలో యువతకు పెద్దపీట వేసే కార్యక్రమానికి ఇదే వేదిక అవుతుందని భావిస్తున్నారు. నారా లోకేష్ గత కొంతకాలంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో యువతకు 33 శాతం అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఆ మాట ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకునే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ మహానాడు పార్టీ భవిష్యత్తు వ్యూహాలను సవరించడం, రాబోయే ఎన్నికల కోసం కార్యాచరణ సిద్ధం చేయడం వంటి కీలక పరిణామాలకు వేదిక కానుంది. 2047 వరకు పార్టీ అధికారంలో కొనసాగాలనుకుంటే, ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న దానిపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుని, పార్టీ మళ్లీ బలంగా నిలవాలనే ఉద్దేశంతో ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తోందని నేతలు చెబుతున్నారు.













