Janasena: నాగబాబుకు ఆరెండు శాఖలే..?

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఓ మంత్రి పదవి విషయంలో, దాదాపు 4-5 నెలల నుంచి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మార్చిలోనే ఆ స్థానానికి నాగబాబుని ఎంపిక చేస్తామని, జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అధికారికంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ(TDP) కూడా ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో సైతం పోస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ వార్షికోత్సవ సభలో, నాగబాబు చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనకు మంత్రి పదవి దూరమైనట్లు ప్రచారం ఉంది.
ఇక తాజాగా మరోసారి నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చర్చలు మొదలయ్యాయి. తొలిసారి శాసనమండలికి నాగబాబు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత, ఆయన సభకు వెళ్లారు. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో టిడిపి సానుకూలంగా ఉన్న సరే, పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా నాగబాబు వ్యాఖ్యల కారణంగా, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా నాగబాబు వైఖరి పై అసహనం వ్యక్తం అయింది. పదేపదే తెలుగుదేశం పార్టీని తక్కువ చేస్తూ నాగబాబు మాట్లాడటాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనితోనే విశాఖలో జరిగిన పార్టీ సమావేశాల్లో పెద్దగా నాగబాబుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ప్రచారం సైతం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి నాగబాబును క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అయితే ఆయనకు ఇచ్చే శాఖల విషయంలో మాత్రం స్పష్టత రాలేదనేది ప్రధానంగా వినపడుతున్న మాట. ప్రస్తుతం నాగబాబుకు చిన్న శాఖలు మాత్రమే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు టూరిజం తో పాటుగా మరో చిన్న శాఖ అప్పగించాలని పవన్ కళ్యాణ్ కూడా, దాదాపుగా సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం టూరిజం జనసేన వద్దనే ఉంది. దానితోపాటుగా క్రీడా శాఖను నాగబాబుకు అప్పగించే అంశంపై, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం క్రీడా శాఖ టిడిపి వద్ద ఉంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడా శాఖకు మంత్రిగా ఉన్నారు. దానితో పాటుగా రవాణా శాఖ కూడా ఆయన నిర్వహిస్తున్నారు.