YCP: దాడుల తర్వాత వైసీపీ నేతలలో కదలిక..
2024 ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు వైసీపీ (YSR Congress Party)లో స్పష్టమైన ఉత్సాహం కనిపించలేదు. నెక్స్ట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని భావించిన చాలా మంది నేతలు, ఇప్పుడే ఎందుకు బహిరంగంగా కదలాలన్న ఆలోచనలోనే ఉండిపోయారు. మరికొందరు మాత్రం పార్టీ కార్యక్రమాలకంటే తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడమే సరిపోతుందన్న భావనతో ముందుకు సాగారు. అందుకే గత 19 నెలలుగా పార్టీ పిలుపునిచ్చిన ఉద్యమాలు, నిరసనలకు పెద్దగా స్పందన కనిపించలేదు. పూర్తిగా దూరంగా కూడా ఉండకుండా, ప్రజల్లోకి వెళ్లినట్టు వెళ్లి, కార్యక్రమాలు జరిగాయన్న ముద్ర వేసినట్టే వ్యవహారం సాగింది.
ఈ పరిస్థితిపై పార్టీ అధినేత జగన్ (Y. S. Jagan Mohan Reddy) పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల్లో చురుకుదనం రావాలని, ప్రజల మధ్య కలివిడిగా ఉండాలని సూచనలు చేశారు. అయినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే ఇటీవల జరిగిన రెండు పరిణామాలు మాత్రం పార్టీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒక్కసారిగా నేతలంతా ఏకం కావడం మొదలైంది. ఉత్తరాంధ్ర (North Andhra) నుంచి సీమ (Rayalaseema) వరకు వైసీపీ శ్రేణుల్లో కదలిక పెరిగింది.
అంబటి రాంబాబు (Ambati Rambabu), జోగి రమేష్ (Jogi Ramesh) ఇళ్లపై దాడులు జరగడం ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారింది. ఈ ఘటనలను పార్టీ నేతలు తేలిగ్గా తీసుకోలేదు. ఇది కేవలం వ్యక్తిగత అంశం కాదని, తమ రాజకీయ స్వరాన్ని అణిచివేసే ప్రయత్నంగా భావించారు. ముఖ్యంగా కాపు, బీసీ వర్గాలను ఏకం చేయడం, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించడం అవసరమని నాయకత్వం భావించింది. అందుకే ఈ అంశాలను భుజాన వేసుకుని, ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.
గతాన్ని పరిశీలిస్తే, ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు టీడీపీలో (Telugu Desam Party) కూడా కనిపించింది. 2019 నుంచి 2021 మధ్య ఆ పార్టీలోనూ నైరాశ్య వాతావరణం నెలకొంది. సమావేశాలు పెట్టినా పెద్దగా స్పందన రాలేదు. అయితే నందిగామ (Nandigama)లో చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu)పై రాళ్ల దాడి, పార్టీ కార్యాలయంపై దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మారింది. అప్పటివరకు వెనుకంజలో ఉన్న నేతలు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. పార్టీని, నాయకుడిని కాపాడుకోవాలన్న భావన వారిని ఏకం చేసింది.
ఇప్పుడు అదే తరహా సమీకరణ వైసీపీలో జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నేతలు వ్యక్తిగతంగా కాకుండా, సమష్టిగా పార్టీ కోసం నిలబడాలన్న భావన బలపడుతోంది. ఈ కదలిక ఎన్నికల వరకు ఎంతవరకు కొనసాగుతుంది, పార్టీకి ఎంత మేలు చేస్తుందన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రస్తుతం మాత్రం వైసీపీలో కనిపిస్తున్న ఐక్యత రాజకీయంగా కీలక సంకేతంగా మారిందని చెప్పాలి.













