7న రాష్ట్రంలోకి రుతుపవనాలు
అమరావతి: ఇస్రో రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 7న రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే రుతుపవనాలు కేరళను తాకాయి. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోకి తొలుత ప్రవేశిస్తాయి. అవి కోస్తాకు చేరేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేడిగాలులు, ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రాల నుంచి అందిన నివేదిక ప్రకారం తీవ్రమైన వడగాల్పులు లేవనీ.. 32 మండలాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణశాఖ వర్గాలు చెప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. విజయవాడ సమీపంలో 45.6 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో తీవ్రమైన వేడి 23 మండలాలు, వేడి 66 మండలాల్లో ఉంది. మరో 319 మండలాల్లో ఉక్కపోతలు ఎక్కువగా ఉన్నాయి. శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహా పరిస్థితులుంటాయని అంచనా వేస్తున్నారు.













