Balakrishna: బాలకృష్ణకు మంత్రి పదవి..! పెరుగుతున్న డిమాండ్!!

హిందూపురం (Hindupur) ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అభిమానులు, టీడీపీ (TDP) కార్యకర్తలు హిందూపురంలో బహిరంగంగా ప్లకార్డులు పట్టుకుని ఇలా డిమాండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ బాలకృష్ణకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నందమూరి అభిమానుల్లో కొంతకాలంగా ఉన్న అసంతృప్తి ఈ తాజా డిమాండ్‌తో మరోసారి బయటపడింది.
బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. ఎన్టీఆర్ తనయుడిగా, టీడీపీ సీనియర్ నాయకుడిగా ఆయనకు మంత్రి పదవి దక్కాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కుతుందని అభిమానులు ఆశించారు. అయితే వాళ్లకు నిరాసే ఎదురైంది. 2024లో పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి పక్కా అని ఆశించారు. అయితే ఈ దఫా కూడా బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో.. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ డిమాండ్‌పై బాలకృష్ణ స్పందించకుండా నవ్వుతూ వెళ్లిపోయారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌పై పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఈయన బాలకృష్ణకు బావ. మరోవైపు.. అల్లుడు నారా లోకేశ్ కూడా మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే కుటుంబం నుంచి మరొకరికి కేబినెట్‌లో స్థానం కల్పించడంపై పార్టీలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కుటుంబ ప్రభావం పార్టీలో తగ్గుముఖం పట్టిందని, పార్టీ పూర్తిగా నారా కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆవేదన నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే, ఆ అసంతృప్తిని కొంతవరకు తగ్గించవచ్చని, పార్టీలో నందమూరి ప్రభావాన్ని తిరిగి పెంచవచ్చని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నప్పటికీ, మంత్రి పదవి కోసం బహిరంగంగా డిమాండ్ చేయకపోవడం ఆయన శైలి. అయితే, అభిమానుల నుంచి ఈ డిమాండ్ పెరగడంతో ఈ అంశం మళ్లీ పార్టీలో చర్చనీయాంశమైంది.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీ వ్యవస్థాపకుడి తనయుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలకృష్ణకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయం పార్టీలోని కుటుంబాల సమతుల్యతపై, అభిమానుల భావోద్వేగాలపై ప్రభావం చూపనుంది. అయితే మంత్రి పదవిపై బాలకృష్ణకు పెద్దగా ఆసక్తి లేదని సమాచారం.