PPP Tender: ఆదోని కాలేజ్ టెండర్… అంతులేని గందరగోళం!
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు రాజకీయ విమర్శలకే పరిమితమైన ఈ అంశం, ఇప్పుడు టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో పరిపాలనా వైఫల్యంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆచరణలో మాత్రం అడుగడుగునా ఎదురుదెబ్బలు తింటోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే, కార్పొరేట్ సంస్థల నుండి ఆశించిన స్పందన రాలేదన్నది సుస్పష్టం. మూడు కాలేజీలకు (మార్కాపురం, పులివెందుల, మదనపల్లె) ఒక్కటంటే ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇది ప్రభుత్వానికి మొదటి షాక్ అయితే, కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే ఒకే ఒక్క బిడ్ రావడం, దాని చుట్టూ నెలకొన్న వివాదం అసలు కథను రక్తి కట్టిస్తోంది.
మొదట, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కిమ్స్ (KIMS) ఆసుపత్రి ఆదోని కాలేజీ నిర్వహణకు ముందుకొచ్చిందని, టెండర్ దాఖలు చేసిందని ప్రభుత్వ వర్గాలు లీకులు ఇచ్చాయి. ప్రముఖ సంస్థ ఆసక్తి చూపిందన్న వార్తతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆ వెంటనే కిమ్స్ యాజమాన్యం “మేము ఎలాంటి టెండర్ వేయలేదు” అని అధికారికంగా ప్రకటించడంతో ప్రభుత్వ వాదన నీటిమూటలా తేలిపోయింది. దీంతో ఇరకాటంలో పడ్డ ప్రభుత్వం, చివరకు నష్ట నివారణ చర్యలకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దీనిపై స్పందించారు. టెండర్ వేసింది కిమ్స్ సంస్థ కాదని, కిమ్స్‌లో పనిచేస్తున్న ఒక డాక్టర్ అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
మంత్రి గారి వివరణతో వివాదం సద్దుమణిగకపోగా, కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను, అత్యాధునిక వైద్య పరికరాలను, వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఒక వ్యక్తి (డాక్టర్) చేతిలో ఎలా పెడతారు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక మెడికల్ కాలేజీని నడపాలంటే కేవలం వైద్య పరిజ్ఞానం ఉంటే సరిపోదు. దానికి భారీ ఆర్థిక వనరులు, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం, నిరంతర పర్యవేక్షణ అవసరం. ఒక కార్పొరేట్ సంస్థకు ఉండే వ్యవస్థాగత నిర్మాణం ఒక ఇండివిడ్యువల్ డాక్టర్‌కు ఉంటుందా? అసలు పీపీపీ టెండర్ల నిబంధనల్లో వ్యక్తులు పాల్గొనవచ్చని ఉందా? ఉంటే, ఆ డాక్టర్‌కు గతంలో మెడికల్ కాలేజీ నడిపిన అనుభవం ఉందా? లేక కేవలం రాజకీయ పలుకుబడితోనే ఈ టెండర్ ప్రక్రియ సాగుతోందా? అన్న అనుమానాలు సామాన్యుల్లోనూ కలుగుతున్నాయి.
ఇప్పటికే ఈ ప్రైవేటీకరణ విధానంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. గత ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యను బలోపేతం చేయాలని సంకల్పిస్తే, కూటమి ప్రభుత్వం దానిని ప్రైవేటుపరం చేస్తూ పేదలకు వైద్యాన్ని దూరం చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ విధానం వల్ల ఫీజులు పెరిగిపోతాయని, సామాన్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందదని ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇన్ని వ్యతిరేకతల మధ్య, ప్రభుత్వం మాత్రం కేంద్రం పీపీపీ మోడల్‌కు ఆమోదం తెలిపిందని, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నామని సమర్థించుకుంటోంది. కానీ, క్షేత్రస్థాయిలో టెండర్లకు స్పందన లేకపోవడం ఆ మోడల్ వైఫల్యాన్ని సూచిస్తోందన్నది విశ్లేషకుల మాట.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ప్రభుత్వం పరువు కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. టెండర్లు రాకపోయినా, వచ్చిన ఒక్క టెండర్ పట్టుకుని ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం సాహసమే అవుతుంది. ఒకవేళ ఆ డాక్టర్‌కు కట్టబెట్టినా, రేపు ఆర్థిక ఇబ్బందుల వల్లో, నిర్వహణ లోపం వల్లో కాలేజీ మూతపడితే బాధ్యత ఎవరిది? అప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు లోపాలు బయటపడితే, వాటిని సరిదిద్దుకోవడం లేదా వెనక్కి తగ్గి పునరాలోచించడం పరిపాలనా దక్షత అవుతుంది. కానీ, మేం పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ముందుకెళ్తే, మున్ముందు న్యాయపరమైన చిక్కులు, పాలనాపరమైన వైఫల్యాలు తప్పవు.
ఆదోని కాలేజ్ టెండర్ వ్యవహారం ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. ప్రైవేటు సంస్థలు ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం రాజకీయ అహంభావంతోనో, గత ప్రభుత్వంపై కక్షతోనో నిర్ణయాలు తీసుకోకుండా, ప్రజారోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, ఈ టెండర్ వ్యవహారం ప్రభుత్వ మెడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు.






