ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలం
రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడంలో తప్పేంటని మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనల పేరిట ఈసీ అభ్యంతరాలు పెట్టడం సరికాదన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఎన్నికల సంఘం.. ఇప్పుడు సమీక్షల్ని అడ్డకోవటం ద్వారా ప్రజలను కూడ ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. వీవీ ప్యాట్లలో 50 శాతం స్లిప్పులను లెక్కించాలంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు. వైకాపా ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించిన ఈసీ ఓట్ల గల్లంతుపై టీడీపీ ఇచ్చినా ఫిర్యాదుపై ఇప్పటి వరకూ స్పందించలేదని ఆరోపించారు. వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లలెక్కింపు విషయంలో చంద్రబాబు పోరాటం చేస్తున్నారని దీనికి జాతీయ స్థాయిలో నేతలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. పోలింగ్ ముగియక ముందే ఈసీ బాగా పని చేస్తోందని వైకాపా అధ్యక్షుడు జగన్ చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.













