Chiranjeevi: అమరావతిని తప్పుబట్టిన చిరంజీవికి ఆహ్వానమా..? సర్వత్రా విస్మయం..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం (Amaravati Re launch) అట్టహాసంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా అమరావతి రీలాంఛ్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. అయితే చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంలో అమరావతికోసం రైతుల నుంచి భూమి సేకరించడాన్ని చిరంజీవి తప్పుబట్టారు. అంతేకాదు.. జగన్ (YS Jagan) మూడు రాజధానుల విధానం (3 Capitals) భేష్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎలా పిలుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవికి ఇది పెద్ద సమస్యగా మారింది.
2014లో టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాదాపు 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించింది. అప్పుడు సాక్షి టీవీలో రోజా (Roja) చేసిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి భూసమీకరణపై స్పందించారు. “ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం లాక్కోవడం సరికాదు. రైతుల నుంచి భూములు తీసుకోవడం తప్పు” అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానాన్ని చిరంజీవి సమర్థించారు. “మూడు రాజధానుల ఆలోచన భేష్. ఇది రాష్ట్రంలో సమానాభివృద్ధికి దోహదం చేస్తుంది” అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అమరావతికి వ్యతిరేకం అనే భావనను కలగజేశాయి.
అమరావతి పునఃప్రారంభోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించడంతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిని, రైతుల భూముల సమీకరణను వ్యతిరేకించిన చిరంజీవిని ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం విడ్డూరం. ఆయన స్పష్టమైన స్టాండ్ చెప్పాలి అని సోషల్ మీడియాలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో జగన్‌కు చిరంజీవి మద్దతిచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆహ్వానిస్తే వెళ్లడం సమంజసం కాదని సూచిస్తున్నారు.
కొంతమంది రైతులు కూడా చిరంజీవిని ఆహ్వానించడాన్ని తప్పుబడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 1600 రోజులకు పైగా ఉద్యమించారని.. అలాంటప్పుడు చిరంజీవి కనీసం నోరు మెదపలేదని గుర్తు చేస్తున్నారు. ‘మా భూములను తీసుకోవడం తప్పన్న చిరంజీవి ఇప్పుడు ఈ వేడుకలో ఎలా పాల్గొంటారు? ఆయన అమరావతిని సమర్థిస్తారా లేక గత స్టాండ్‌తోనే ఉంటారా?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం చిరంజీవిని ఆహ్వానించడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కొందరు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు అమరావతిని రాష్ట్ర ఆత్మగా చెప్తున్నారు. చిరంజీవి లాంటి ప్రముఖులను ఆహ్వానించడం ద్వారా అమరావతికి మరింత పేరు వస్తుంది. పైగా నాడు విమర్శించిన చిరంజీవి లాంటి వాళ్లు ఇప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నారనే సంకేతాలు తీసుకెళ్తుంది. పైగా తాము అందరినీ కలుపుకుపోతున్నామనే భావనను కలగజేస్తుంది. అందులో భాగంగానే చిరంజీవిని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఇప్పుడైనా అమరావతిపై చిరంజీవి తన అభిప్రాయమేంటో చెప్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.