Mega DSC: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్ మొదటి వారంలో
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Notification) ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని అన్నారు.
మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తాం. అయోమయంలో పడేసిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టాం. రాజధాని అమరావతి (Amaravati) ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తాం. ప్రపంచ బ్యాంకు(World Bank) , ఏడీబీ (ADB) వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తాం. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలి. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు చేరాల్సిందే. జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలి. వచ్చే ఏడాదికి 15 శాతం ప్లస్ జీఎస్డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.













