Mayasabha: ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న మయసభ.. ఇందులో నిజమెంత?
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ నేతలపై ఎన్నో చిత్రాలు వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ తాజాగా మయసభ (Mayasabha) అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కి కథ, మాటలు, దర్శకత్వం అందించినది ప్రముఖ దర్శకుడు దేవా కట్టా (Deva Katta), కిరణ్ జై కుమార్ (Kiran Jai Kumar) . ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రధాన నాయకుల రాజకీయ ప్రయాణం చూపించబడింది.
ఒకవైపు తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S. Rajasekhara Reddy) పాత్రలను వరుసగా ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), చైతన్య రావు (Chaitanya Rao) పోషించారు. ఈ సిరీస్‌లో ఎన్టీఆర్ (NTR), ఇందిరా గాంధీ (Indira Gandhi), సంజయ్ గాంధీ (Sanjay Gandhi), పరిటాల రవి (Paritala Ravi), వంగవీటి రాధా (Vangaveeti Radha), నాదెండ్ల భాస్కర రావు (Nadendla Bhaskara Rao) వంటి 1970ల నుండి 1990ల వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపిన పలువురి పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు సమతూకంగా ప్రాధాన్యం ఇవ్వడానికి మేకర్స్ ప్రయత్నించారు.
అయితే ఈ సిరీస్‌లో చూపిన కొన్ని రాజకీయ కోణాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, వైఎస్సార్ మధ్య స్నేహాన్ని హైలైట్ చేయడం, రాజకీయ జీవితం ప్రారంభంలో వీరిద్దరూ ఒకరికొకరు సహకరించినట్లు చూపడం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వాస్తవానికి పూర్తిగా బిన్నంగా ఉంది. నిజానికి వారు కాంగ్రెస్ పార్టీలో కలసి ఉన్నప్పటికీ, ఆ స్నేహం సినిమాలో చూపించినంత గాఢంగా లేదని చెబుతున్నారు.
అలాగే వైఎస్సార్‌ను ఎన్టీఆర్‌కి వీరాభిమాని లాగా చూపించడం, చంద్రబాబు – ఎన్టీఆర్ కుమార్తె మధ్య సంబంధం ఏర్పడటానికి వైఎస్సారే కారణం అన్నట్లు చూపించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ అంశాలు చారిత్రక నిజాల కంటే కల్పనకు దగ్గరగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ డ్రామా కోసం కొంత ఫిక్షన్ జోడించడం సహజమే అయినప్పటికీ, వాస్తవాన్ని పూర్తిగా మార్చడం సిరీస్‌పై నమ్మకాన్ని తగ్గించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయ చరిత్ర ఆధారంగా రూపొందిన ప్రాజెక్టులు ఎప్పుడూ సున్నితమైనవి. అందులో నిజం, కల్పితం మధ్య సమతూకం తప్పనిసరి. మయసభలో ఆ హద్దు దాటినట్లుగా అనిపించే కొన్ని సన్నివేశాలు ఉండటంతో, వీటి ప్రభావం ముఖ్యంగా చంద్రబాబు, వైఎస్సార్ ఇమేజ్లపై పడుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఈ సిరీస్ చుట్టూ మరిన్ని రాజకీయ వాదనలు, ప్రతివాదనలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో అంశాలపై నందమూరి కుటుంబ సభ్యులు, వైయస్ఆర్ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.







