Kolikapudi: కొలికపూడి రాజీనామా చేస్తారా..? వేటు పడుతుందా..?
తిరువూరు ఎమ్మెల్యే (Tiruvur MLA) కొలికపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao) రాజీనామా వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇచ్చిన 48 గంటల రాజీనామా గడువు (deadline) ఇవాల్టితో ముగియనుంది. దీంతో ఆయన రాజీనామా చేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొలికపూడి శ్రీనివాస రావు పదే పదే పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉండడంతో ఆయనపై నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీకి (three men committee) హైకమాండ్ ఆదేశించింది. ఒకవేళ త్రిసభ్య కమిటీ నివేదిక ఇస్తే కొలికపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆయనే ముందు రాజీనామా చేస్తారా.. లేకుంటే పార్టీయే ఆయనపై వేటు వేస్తుందా.. అనే దానిపై ఆసక్తి నెలకొంది.
కొలికపూడి శ్రీనివాస రావు తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా (TDP MLA) గెలిచినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈసారి, సొంత పార్టీ నాయకుడు రమేష్ రెడ్డిపై (Ramesh Reddy) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన 48 గంటల గడువు విధించారు. రమేష్ రెడ్డి గతంలో AMC ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో కొలికపూడి ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఆయన ఈ అల్టిమేటం (ultimatum) జారీ చేశారు.
“పార్టీలో క్రమశిక్షణ ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం సరైన విలువలను పాటించాలి. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.” అని కొలికపూడి స్పష్ట చేశారు. ఈ ప్రకటన టీడీపీ కేడర్‌లో ఒక వైపు ఆందోళన కలిగించగా, మరోవైపు ఆయన నిర్ణయాన్ని సమర్థించే వారూ లేకపోలేదు. కొందరు పార్టీ కార్యకర్తలు కొలికపూడి తీరును సమర్థిస్తున్నారు. “మంచి ప్రభుత్వంలో ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తుంది” అని కొందరు చెప్తున్నారు.
అయితే, కొలికపూడి గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ కార్యకర్తలే ధర్నా చేశారు. అప్పట్లో ఆయన పబ్లిక్‌గా మీడియాపైనా అసభ్యంగా మాట్లాడారు. ఈ ఆరోపణలపై విచారణ జరిగినా, ఆ తర్వాత ఆయన దీక్ష చేపట్టడం, సీఎం చంద్రబాబు నాయుడు జోక్యంతో దాన్ని విరమించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆయన తాజా డెడ్‌లైన్ పార్టీలో కలకలం రేగింది.
టీడీపీ జిల్లా నాయకులు మాత్రం కొలికపూడి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. “ఆయన ప్రవర్తన వల్ల కేడర్ ఇబ్బంది పడుతోంది. వైఎస్సార్సీపీతో కలిసి పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి,” అని ఒక నాయకుడు అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయకపోతే, పార్టీ ఆయనపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవాల్టితో డెడ్‌లైన్ ముగియనుండటంతో కొలికపూడి రాజీనామా చేస్తారా లేదా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఒకవేళ పార్టీ వేటు వేస్తే కొలికపూడి స్వతంత్రంగా లేదా వైఎస్సార్సీపీ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి.













