నాసా సదస్సుకు ఏపీ విద్యార్థినులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది విద్యార్థినులకు అమెరికాలోని జాతీయ అంతరిక్ష కేంద్రం (ఎన్ఎస్సీ) నుంచి ఆహ్వానం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు వీరికి ఈ ఆహ్వానం లభించింది. ఇప్పటివరకు కార్పొరేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు ఎంపికైన సందర్భాలే ఎక్కువుగా ఉన్నాయి. కానీ తొలిసారిగా చిత్తురు, నెల్లూరు జిల్లాలకు చెందిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులు 11 మంది ఈ సదస్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ 11 మంది ఈ నెల 24 నుంచి 27 వరకు లాస్ ఏంజెల్స్‌లో జరిగే జాతీయ సదస్సుకు హాజరై, నాసాను సందర్శిస్తారు. ఈ సదస్సులో అంతరిక్షంలో మానవ జీవనం అనే అంశంపై ఈ విద్యార్థులు తమ నివేదికను సమర్పిస్తారు. ఈ సదస్సుకు పిల్లలతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హాజరవుతున్నారు.













