Kesineni Nani: ఇలా చేస్తే ఎలా నాని గారూ..!?

మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani), ప్రస్తుత ఎంపీ, సోదరుడు కేశినేని చిన్ని (Kesineni Chinni) మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. ఉర్సా క్లస్టర్స్ (Ursa Clusters)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించడంపై కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేటాయింపుల వెనుక చిన్ని హస్తం ఉందని, ఆయన బినామీలకు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) ఫిర్యాదు చేస్తూ, ఈ భూకేటాయింపులను రద్దు చేయాలని నాని డిమాండ్ చేశారు.
అయితే ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. తమ నిర్ణయం పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేసింది. ఉర్సా క్లస్టర్స్ కు భూమి కేటాయింపు విషయంలో అన్ని నిబంధనలు పాటించామని, పెట్టుబడిదారుల సామర్థ్యాలను బాగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేటాయింపులకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వం బయటపెట్టింది. భూకేటాయింపులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు జరిగాయని ప్రభుత్వం వివరించింది. ఉర్సా క్లస్టర్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది.. ఈ నిర్ణయంలో ఎలాంటి అవినీతి లేదని, అన్ని ప్రక్రియలూ చట్టబద్ధంగా జరిగాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, నాని చేసిన ఆరోపణలు వ్యక్తిగతమేనని, రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నంగా భావించవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేశినేని నాని, చిన్ని మధ్య రాజకీయ, కుటుంబ వైరం ఈ ఆరోపణలకు మూల కారణంగా కనిపిస్తోంది. గతంలో ఒకే పార్టీలో ఉంటూ విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ సోదరుల మధ్య బహిరంగ విభేదాలు తెరపైకి వచ్చాయి. నాని టీడీపీ నుండి వైసీపీలోకి మారిన తర్వాత, చిన్ని టీడీపీలో కొనసాగుతూ ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో, నాని ఆరోపణలను రాజకీయ కోణంలో చూడవచ్చని కొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ప్రకారం, ఉర్సా క్లస్టర్స్ వెనుక కేశినేని చిన్ని బినామీగా ఉన్నారని, గతంలో 21 సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి గట్టి ఆధారాలు లేవు. వీటిని పూర్తిగా నమ్మడం కష్టం. ఈ ఆరోపణలు నాని వ్యూహంలో భాగమై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన తర్వాత కూడా సోదరుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.