Kesineni Nani: బీజేపీలోకి కేశినేని నాని..!? నిజమేంటి..!?
కేశినాని నాని (Kesineni Nani) దాదాపు రెండు దశాబ్దాలుగా సుపరిచితమైన పేరు. వ్యాపారరంగంలోనూ, రాజకీయాల్లానూ తనదైన ముద్ర వేసిన నేత. ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీలో (TDP) రెండు సార్లు విజయవాడ పార్లమెంటు (Vijayawada Parliament) నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ (YCP) నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఆ వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడాయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఆయన బీజీపీలో (BJP) చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేశినేని నానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన విజయవాడ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా కనిపించింది. అలాంటి వేవ్ లో కూడా కేశినేని నాని గెలిచారు. దీన్నిబట్టి ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత టీడీపీ హైకమాండ్ తో తలెత్తిన విభేదాలు ఆయన్ను పార్టీకి దూరం చేశాయి. 2024 వరకూ ఆయన టీడీపీలోనే కొనసాగినా అసంతృప్తితో రగిలిపోతుండేవారు. కారణాలు తెలియవు కానీ చంద్రబాబుతో, లోకేశ్ తో ఆయన దూరం జరిగారు. ఎన్నికల నాటికి ఆయనకు టికెట్ దక్కదేమోనని.., ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఖాయమని అర్థమైపోయింది.
దీంతో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వెంటనే వైసీపీలో చేరిపోయారు. వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించింది. అయితే ఎన్నికల్లో కేశినేని నాని ఓడిపోయారు. ఆ వెంటనే గతేడాది జూన్ 10న తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ జోరందుకుంది. బీజేపీ హైకమాండ్ తో.. ముఖ్యంగా నితిన్ గడ్కరీతో (Nithin Gadkari) ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆయన ద్వారా పురంధేశ్వరితో (Purandeswari) కూడా లైన్ క్లియర్ చేసుకున్నారని.. త్వరలోనే ఆయన కమలం కండువా కప్పుకోవడం ఖాయమని విజయవాడలో టాక్ నడుస్తోంది.
అయితే రాజకీయాల్లోకి పునఃప్రవేశంపై కేశినేని నాని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని.. తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో లేకపోయినా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుంటానని చెప్పారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి తిరిగి రాబోవట్లేదని స్పష్టమైంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన కేశినేని నాని.. అనవసర ఈగోలతో పార్టీకి దూరమయ్యారని.. ఆయన పార్టీలో కొనసాగి ఉంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేదని ఆయన సన్నిహితులు చెప్తుంటారు.













